Nara Chandrababu Naidu: చంద్రబాబు పాలన అద్భుతం, ఆయనొక దార్శనికుడు.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ

Chandrababu Naidus Governance Praised by Supreme Court Ex Judge
  • బాబు పాలనపై జస్టిస్ గోపాలగౌడ ప్రశంసలు
  • ఆయన పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం
  • అమరావతికి గతంలో వ్యక్తిగతంగా మద్దతు తెలిపినట్లు వెల్లడి 
  • వైసీపీ హయాంలోని అవినీతి అధికారులను శిక్షించాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పరిపాలన అద్భుతమని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ కితాబిచ్చారు. చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడని, ఆయన నేతృత్వంలో రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అన్నమయ్య జిల్లాలోని తన తల్లి స్వగ్రామమైన చీకలబైలులో జరుగుతున్న గంగమ్మ జాతరలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన నిన్న మీడియాతో పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి తాను గతంలోనే వ్యక్తిగతంగా మద్దతు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అమరావతి రైతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారికి న్యాయం చేస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయడం అభినందనీయమని అన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలితే కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ గోపాలగౌడ సూచించారు. అధికారం చేతిలో ఉందని అరాచకాలకు పాల్పడే వారికి చట్ట ప్రకారం తగిన శిక్షలు పడినప్పుడే ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లుతుందన్నారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో ఎవరూ తప్పు చేయడానికి సాహసించకుండా నిరోధిస్తాయని జస్టిస్ గోపాలగౌడ అభిప్రాయపడ్డారు. 
Nara Chandrababu Naidu
Justice Gopal Gowda
Andhra Pradesh Politics
Amaravati
YSRCP Government
IAS IPS Officers
Corruption Investigation
Telugu Politics
Chief Minister
Supreme Court Judge

More Telugu News