Colonel Sofia Khureshi: కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Madhya Pradesh Ministers Controversial Remarks on Colonel Sofia Khureshi
  • మతంతో ముడిపెట్టి ఖురేషీపై మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం, మంత్రి పదవికి రాజీనామా డిమాండ్
  • బీజేపీ అధిష్టానం మందలింపు.. విజయ్ షా క్షమాపణ
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సొంత పార్టీ బీజేపీ కూడా ఆయన వ్యాఖ్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇటీవల ఇండోర్ సమీపంలోని ఒక గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి విజయ్‌ షా మాట్లాడుతూ "ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదుటి సిందూరాన్ని తుడిచివేసి, వారిని వితంతువులుగా మార్చారు. దానికి ప్రతిగా, వారి (ఉగ్రవాదుల) మతానికి చెందిన ఒక సోదరిని (కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ) గౌరవనీయులైన మోదీజీ సైనిక విమానంలో పాకిస్థాన్‌కు పంపి గట్టిగా బుద్ధి చెప్పారు" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు క్షణాల్లోనే వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మహిళా సైనికాధికారిణిని మతంతో ముడిపెట్టి మాట్లాడటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

బీజేపీ అధిష్ఠానం మందలింపు 
వివాదం ముదరడంతో మధ్యప్రదేశ్‌ బీజేపీ అధిష్ఠానం కూడా ఈ విషయంపై జోక్యం చేసుకుంది. మంత్రి విజయ్‌ షాను పిలిపించి, ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని గట్టిగా మందలించినట్లు తెలిసింది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించవద్దని సూచించినట్లు తెలిసింది.

 మంత్రి క్షమాపణ 
అన్ని వైపుల విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి విజయ్‌ షా దిగివచ్చి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఉగ్రవాదుల దుశ్చర్యల వల్ల తన మనసు తీవ్రంగా కలత చెందిందని, ఆ ఆవేదన, ఆవేశంలోనే అటువంటి మాటలు అన్నానని తెలిపారు. "కులమతాలకు అతీతంగా దేశానికి సేవలందిస్తున్న కల్నల్ ఖురేషీ సేవలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఆమెను కించపరిచే ఉద్దేశం నాకు కలలో కూడా లేదు. నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే, పదిసార్లు క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను" అని విజయ్ షా పేర్కొన్నారు. 
Colonel Sofia Khureshi
Vijay Shah
Madhya Pradesh Minister
Controversial Remarks
BJP
Congress
India-Pakistan Tension

More Telugu News