Mohammed Sinwar: గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడి.. యాహ్యా సిన్వార్ సోదరుడి హతం!

Israels Deadly Gaza Airstrike Kills Hamas Commander Mohammed Sinwar
  • ఖాన్ యూనిస్‌లోని ఐరోపా ఆసుపత్రి భూగర్భ కమాండ్ సెంటర్‌ లక్ష్యంగా దాడులు
  •  మహమ్మద్ సిన్వార్ మృతిపై ఎలాంటి ప్రకటన చేయని ఇజ్రాయెల్ సైన్యం  
  •  దాడిలో 28 మంది పౌరులు మరణించారన్న గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ
  •  యుద్ధ విరమణ, బందీల విడుదలపై ఇజ్రాయెల్, హమాస్ పరస్పర డిమాండ్లు  
హమాస్ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్ సోదరుడు, కీలక కమాండర్ అయిన మహమ్మద్ సిన్వర్‌ను ఇజ్రాయెల్ భద్రతా దళాలు మట్టుబెట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఐరోపా ఆసుపత్రి కింద హమాస్ ఒక భూగర్భ కమాండ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు విరుచుకుపడినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిన కొద్దిసేపటికే ఆసుపత్రి అండర్‌గ్రౌండ్ నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది. ఈ వైమానిక దాడిలోనే మహమ్మద్ సిన్వర్ మరణించి ఉంటారని భావిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైనిక వర్గాలు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మరోవైపు, ఈ దాడిలో సుమారు 28 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గాజాలోని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ఆరోపించింది. ఆ సంస్థ ప్రతినిధి మహమ్మద్ బస్సాల్ మాట్లాడుతూ "క్షేత్రస్థాయిలోని మా సిబ్బంది అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 28 మృతదేహాలను గుర్తించాం" అని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

 మహమ్మద్ సిన్వార్ నేపథ్యం 
మహమ్మద్ సిన్వర్ తన సోదరుడు యాహ్యా సిన్వార్‌ లానే హమాస్ మిలిటరీ విభాగంలో సుదీర్ఘకాలంగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. యాహ్యా సిన్వర్ తర్వాత హమాస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం మహమ్మద్‌కే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన చాలాకాలంగా అజ్ఞాతంలో ఉంటూ ఇజ్రాయెల్ నిర్వహించిన అనేక ఆపరేషన్ల నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. నెతన్యాహు ప్రభుత్వం మహమ్మద్ సిన్వార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 ఇజ్రాయెల్, హమాస్ పరస్పర డిమాండ్లు 
 హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలు విడిచిపెట్టి, బందీలుగా ఉన్నవారిని విడుదల చేసేంతవరకు తమ సైనిక చర్యలు ఆగవని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. మరోవైపు, ఇజ్రాయెల్ తమపై యుద్ధాన్ని పూర్తిగా ఆపివేసే వరకు ఆయుధాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బందీల విడుదల కూడా సాధ్యం కాదని హమాస్ తేల్చి చెబుతోంది. ఈ పరస్పర వైఖరులతో గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Mohammed Sinwar
Yahya Sinwar
Israel
Hamas
Gaza
Israel-Hamas Conflict
Gaza Strip
Khan Yunis
Military Operation
Targeted Killing

More Telugu News