India bans China media: చైనా మీడియాకు భారత్ షాక్

India Bans Chinese Media Outlets for Spreading Misinformation
  • మీడియా సంస్థల ఎక్స్ ఖాతాలపై వేటు
  • భారత సైన్యంపై దుష్ప్రచారం చేస్తున్న గ్లోబల్ టైమ్స్, జిన్హువా ఖాతాలు బ్లాక్
  • వాస్తవాలు ధ్రువీకరించుకోవాలని గతంలోనే చైనా మీడియాకు భారత రాయబార కార్యాలయం సూచన
భారత సాయుధ బలగాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న కారణంతో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థలు గ్లోబల్ టైమ్స్, జిన్హువాలకు చెందిన ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం బుధవారం నిషేధించింది. సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకునే ముందు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని చైనాలోని భారత రాయబార కార్యాలయం ఇటీవల సదరు మీడియా సంస్థను హెచ్చరించింది. అయినప్పటికీ తప్పుడు ప్రచారం ఆపకపోవడంతో తాజాగా భారత ప్రభుత్వం బ్యాన్ విధించింది.

"ప్రియమైన గ్లోబల్ టైమ్స్ న్యూస్, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ముందు దయచేసి వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని, మీ వార్తా మూలాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము," అని మే 7న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఒక పోస్టులో పేర్కొంది. "#ఆపరేషన్‌సిందూర్ నేపథ్యంలో కొన్ని పాకిస్థాన్ అనుకూల హ్యాండిళ్లు నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి సమాచారాన్ని మీడియా సంస్థలు నిర్ధారించుకోకుండా ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యం, పాత్రికేయ నైతిక విలువల ఉల్లంఘనే అవుతుంది" అని మరో పోస్టులో స్పష్టం చేసింది.

బహవల్పూర్ సమీపంలో భారత రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చివేశారంటూ పాకిస్థానీ ఖాతాలు, కొన్ని మీడియా సంస్థలు చేసిన వైరల్ ఆరోపణల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ప్రచారంలో ఉన్న ఒక చిత్రాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం తప్పుదోవ పట్టించేదిగా గుర్తించింది. అది వాస్తవానికి 2021లో పంజాబ్‌లోని మోగా జిల్లాలో కూలిపోయిన మిగ్-21 విమాన చిత్రమని స్పష్టం చేసింది.

అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు చైనా పేర్లపై విదేశాంగ శాఖ ఖండన
అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చైనా ఇటీవల కొత్త పేర్లు పెట్టడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఈ వాస్తవాన్ని నిరాధార యత్నాలతో మార్చలేరని స్పష్టం చేసింది. "భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రాంతాలకు పేర్లు పెట్టేందుకు చైనా నిరంతరాయంగా చేస్తున్న అసంబద్ధమైన ప్రయత్నాలను మేము గమనించాం. ఈ ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమనే వాస్తవాన్ని పేర్లు పెట్టడం ద్వారా మార్చలేరు" అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
India bans China media
Global Times
Xinhua
Misinformation
Indian Armed Forces
Fact Check
PIB
Arunachal Pradesh
China-India relations
India-China border dispute

More Telugu News