Kapil Surana: యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత!

Turkey Boycott Udaipur Marble Traders Halt Imports
  • పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాక్ కు టర్కీ మద్దతు
  • ఆపరేషన్ సిందూర్ సమయంలో డ్రోన్లు అందజేత
  • టర్కీ అంటేనే మండిపడుతున్న భారతీయులు
  • ఇప్పటికే టర్కీ యాపిల్స్ దిగుమతి నిలిపివేసిన పుణే వ్యాపారులు
  • ఇప్పుడు మార్బుల్స్ దిగుమతి నిలిపివేతకు ఉదయ్ పూర్ వ్యాపారుల నిర్ణయం
భారత-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్న టర్కీకి వాణిజ్యపరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పుణేలోని వ్యాపార వర్గాలు టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతులను నిలిపివేయగా... అదే కోవలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మార్బుల్ వ్యాపారులు టర్కీ నుంచి మార్బుల్ దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య ద్వారా భారత ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు, దేశీయ మార్బుల్ పరిశ్రమకు ఊతమివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్ ఎగుమతి కేంద్రంగా పేరుగాంచిన ఉదయ్‌పూర్‌లో, మార్బుల్ ప్రాసెసర్స్ కమిటీ ఈ మేరకు కీలక తీర్మానం చేసింది. కమిటీ అధ్యక్షుడు కపిల్ సురానా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, "పాకిస్థాన్‌కు టర్కీ అందిస్తున్న మద్దతును నిరసిస్తూ, మా కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా టర్కీతో వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించారు" అని తెలిపారు. భారతదేశానికి దిగుమతి అయ్యే మొత్తం మార్బుల్‌లో దాదాపు 70 శాతం టర్కీ నుంచే వస్తుందని ఆయన గుర్తుచేశారు.

ఈ నిర్ణయం కేవలం ఉదయ్‌పూర్‌కే పరిమితం కాకూడదని సురానా ఆకాంక్షించారు. "దేశంలోని అన్ని మార్బుల్ సంఘాలు టర్కీతో వాణిజ్యాన్ని నిలిపివేస్తే, అది ప్రపంచానికి ఒక బలమైన సందేశాన్ని పంపుతుంది. భారత ప్రభుత్వం ఒంటరి కాదని, దేశంలోని పరిశ్రమలు మరియు యావత్ భారతీయులు ప్రభుత్వానికి అండగా నిలుస్తారని స్పష్టమవుతుంది," అని ఆయన అభిప్రాయపడ్డారు.

టర్కీతో వాణిజ్యం నిలిచిపోవడం వల్ల భారతీయ మార్బుల్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని, తద్వారా దేశీయ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని కపిల్ సురానా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ 'బాయ్‌కాట్ టర్కీ' పిలుపు ఇతర రంగాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్య టర్కీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు, అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు మద్దతిచ్చే దేశాలకు ఒక హెచ్చరికగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు.

ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను కలిసి మద్దతుగా నిలిచారు. అంతేకాదు, ఓ సైనిక రవాణా విమానం నిండా డ్రోన్లను పాక్ కు అందించినట్టు కథనాలు వచ్చాయి. భారత్ కూల్చిన డ్రోన్లలో టర్కీ తయారీ అసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్ల శకలాలు కనిపించడం పాక్ కు టర్కీ సైనిక సాయం నిజమేనని నిర్ధారిస్తోంది. ఈ పరిణామం టర్కీ పట్ల భారత్ లో తీవ్ర వ్యతిరేకతను రాజేస్తోంది.
Kapil Surana
Turkey Boycott
India-Pakistan Tension
Udaipur Marble
Turkey-Pakistan Relations
Boycott Turkish Goods
Turkish Drones
Economic Sanctions
International Relations
Marble Industry

More Telugu News