Benjamin Netanyahu: గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి

48 Killed in Gaza Airstrike
  • ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, భారీ ప్రాణ నష్టం
  • మృతుల్లో 22 మంది చిన్నారులు
  • గాజాలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టీకరణ
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న ఘర్షణలతో గాజా ప్రాంతం మరోసారి దాడులతో దద్దరిల్లుతోంది. ఉత్తర గాజాలోని నివాస ప్రాంతాలపై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంలో ఇళ్లపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దుర్ఘటనలో 48 మంది పౌరులు మరణించగా, వారిలో 22 మంది చిన్నారులు ఉన్నారని స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అనేక నివాస భవనాలు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా హమాస్ ఒక ఇజ్రాయెల్-అమెరికన్ బందీని విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం.

మరోవైపు, గాజాలో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. దీంతో యుద్ధ విరమణ ఒప్పందంపై నెలకొన్న ఆశలు సన్నగిల్లాయి. ఇటీవల ఇజ్రాయెల్‌పై హూతీలు జరిపిన దాడుల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హూతీలను కచ్చితంగా ఎదుర్కొంటామని, గతంలో ఐడీఎఫ్ చేసిన దాడులను వారు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఈసారి దాడులు తీవ్రంగా ఉంటాయని, బాంబుల మోతలతో హోరెత్తిస్తామని ఆయన అన్నారు.
Benjamin Netanyahu
Israel
Gaza
Airstrike
Hamas
Palestine
Civilian Casualties
Middle East Conflict

More Telugu News