Pakistan: సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ

Pakistan Seeks Talks with India on Indus Waters
  • సింధూ జలాల ఒప్పందంపై భారత్‌ను పునఃపరిశీలించమని కోరిన పాకిస్థాన్
  • జలాల నిలిపివేతతో తీవ్ర కరవు తప్పదని పాక్ జలవనరుల శాఖ ఆందోళన
  • ఈ విషయంపై చర్చలకు సిద్ధమని భారత ప్రభుత్వానికి పాక్ లేఖ
సింధూ నదీ జలాల ఒప్పందం విషయంలో ఇదివరకు దూకుడుగా వ్యవహరించిన పాకిస్థాన్ వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఒప్పందాన్ని నిలిపివేస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలను గ్రహించిన ఆ దేశం, ఈ అంశంపై తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భారత్‌ను అభ్యర్థించింది. సింధూ జలాల విషయంలో తగ్గేది లేదని భారత్ పదేపదే తేల్చి చెప్పడంతో పాకిస్థాన్ తానే వెనక్కి తగ్గింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.

సింధూ నదీ జలాలను భారత్ నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ, భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసినట్లు సమాచారం. ఈ సున్నితమైన అంశంపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆ లేఖలో పేర్కొంది. నిబంధనల ప్రకారం, ఈ లేఖను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ విషయంలో భారత్ తన వైఖరిని ఇదివరకే స్పష్టం చేసింది. "రక్తం, నీరు రెండూ ఏకకాలంలో ప్రవహించలేవు" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే తేల్చిచెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే అవి కేవలం ఉగ్రవాదం నిర్మూలన, పీవోకేకు సంబంధించిన అంశాలపైనే ఉంటాయని స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది.
Pakistan
India
Indus Waters Treaty
Narendra Modi
Indo-Pak Relations
Pakistan Letter to India
Indus River Water

More Telugu News