Revanth Reddy: ఆ ఘనత తనదేనని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి తంటాలు పడుతున్నారు: హరీశ్ రావు

Revanth Reddys Attempts to Claim Credit Harish Raos Criticism
  • బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలిచ్చి తమ ఘనతగా సీఎం చెబుతున్నారని విమర్శ
  • కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, ఆయకట్టుపై సీఎం పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శ
  • కాంగ్రెస్ పాలనలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురైందని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకు ప్రస్తుత ప్రభుత్వం నియామక పత్రాలు అందిస్తూ, ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఉద్యోగాలు పొందుతున్న యువతలో ఉత్సాహం నింపాల్సింది పోయి, హెచ్చరికలు జారీ చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రాజెక్టు వ్యయం, దాని ద్వారా అందిన సాగునీటి లభ్యతపై సీఎం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. "ఒకసారి లక్షా 50 వేల కోట్లు, మరోసారి లక్ష కోట్లు ఖర్చు అంటారు. ఒకసారి ఒక్క గుంటకు నీళ్లు ఇవ్వలేదంటారు, ఇంకోసారి 50 వేల ఎకరాలకే నీళ్లిచ్చామంటారు. అసెంబ్లీ సాక్షిగా మీరే విడుదల చేసిన శ్వేతపత్రంలో కాళేశ్వరం ద్వారా 20 లక్షల ఎకరాలకు (కొత్త, స్థిరీకరణ) సాగునీరు అందించినట్లు ప్రకటించి, ఇప్పుడు మళ్లీ తప్పుడు లెక్కలు చెబుతున్నారు" అని విమర్శించారు.

ఎన్‌డీఎస్ఏ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు 99 శాతం సురక్షితంగా ఉందని, కేవలం ఒక శాతం మాత్రమే మరమ్మతులకు గురైందని స్పష్టంగా ఉన్నప్పటికీ, ప్రాజెక్టు మొత్తం కుప్పకూలిపోయిందంటూ సీఎం అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. "అధికారులను ఉరితీయాలని విజిలెన్స్, ఎన్‌డీఎస్ఏ నివేదికలు చెబుతాయా? ఇది ప్రజాస్వామ్యమా లేక రేవంత్ రాచరికమా?" అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇంజనీర్ కాదని, ఇరిగేషన్ నిపుణుడు కాదని, అయినప్పటికీ కాళేశ్వరం కూలిపోయిందని ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నారని నిలదీశారు.

ఎస్ఎల్‌బీసీ సొరంగం విషయంలో ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని హరీశ్ రావు విమర్శించారు. సొరంగంలో చిక్కుకుపోయి మూడు నెలలు కావస్తున్నా వారిని కాపాడే విషయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 3,900 కోట్లు ఖర్చు చేసి 12 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తి చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించిన హరీశ్ రావు, దీనిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పెద్దవాగు తెగిపోయిందని, ఎస్ఎల్‌బీసీ కుప్పకూలిందని, వట్టెం పంప్ హౌస్ నీట మునిగిందని అన్నారు. ఇరిగేషన్ శాఖలో 30 ఈఎన్‌సీ, సీఈ పోస్టులకు గాను 15... 57 సూపరింటెండెంట్ ఇంజినీర్ల పోస్టులకు గాను 40 ఖాళీగా ఉండటమే తెలంగాణ నీటిపారుదల శాఖ దీనస్థితికి నిదర్శనమని అన్నారు. ఏడాదిన్నర పాలనలో ఇరిగేషన్ శాఖలో చెప్పుకోవడానికి ఏమీ లేకనే సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ పదేళ్ల పాలనలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కింద 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించామని, 31.50 లక్షల ఎకరాలను స్థిరీకరించామని గుర్తు చేశారు. మొత్తంగా 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని బాగు చేశామని పేర్కొన్నారు. "ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పారు. మీ 18 నెలల పాలనలో కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి" అని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. ఇరిగేషన్ రంగంలో కేసీఆర్ సాధించిన ప్రగతిని చెరిపేస్తే చెరిగిపోయేది కాదని ఆయన అన్నారు.
Revanth Reddy
Harish Rao
Telangana Politics
Congress
BRS
Kaleshwaram Project
SLBC Tunnel

More Telugu News