Zakir Ahmad: కర్రతో తలపై కొట్టి, గాజు పెంకుతో చేయి నరాలు కోసి భార్య దారుణ హత్య

Brutal Murder in Hyderabad Man Kills Wife with Stick and Glass
  • భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం
  • హైదరాబాద్ బాలాపూర్‌లో ఘటన
  • వివాహేతర సంబంధం నెపంతో దారుణం
  • పిల్లల ద్వారా విషయం వెలుగులోకి
అనుమానం ఓ కాపురంలో చిచ్చుపెట్టి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చిన దారుణ ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన జకీర్ అహ్మద్ (31)కు ఇద్దరు భార్యలు. వీరిలో రెండో భార్య నాజియాబేగం (30). ఈ దంపతులకు ముగ్గురు సంతానం. కొంతకాలంగా నాజియాబేగంపై జాకీర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో పదిహేను రోజుల క్రితం జల్‌పల్లి కొత్తపేట కాలనీకి మకాం మార్చాడు. అయినప్పటికీ జకీర్ తన భార్యను రహస్యంగా గమనిస్తూనే ఉన్నాడు.

ఈ నెల 13వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో జకీర్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పిల్లలు మరో గదిలో ఉన్నారు. నాజియాబేగంతో జాకీర్‌కు వివాహేతర సంబంధం విషయమై తీవ్ర వాగ్వివాదం జరిగింది. సహనం కోల్పోయిన జకీర్ మొదట కర్రతో నాజియాబేగం తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయింది. అంతటితో ఆగకుండా కిటికీ అద్దాన్ని పగులగొట్టి గాజు ముక్కతో ఆమె కుడిచేతి నరాలను కోశాడు. చివరిగా, చున్నీతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

జరిగిన ఘోరాన్ని గమనించిన పిల్లలు వెంటనే తమ అమ్మమ్మకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. నాజియాబేగం తల్లి, సోదరుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన దారుణాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు జకీర్ అహ్మద్ కోసం గాలిస్తున్నారు.
Zakir Ahmad
Najiab Begum
Hyderabad Murder
Domestic Violence
Brutal Killing
Wife Murder
Balapur Police Station
Golconda
Jealousy
Extramarital Affair

More Telugu News