NTR University of Health Sciences: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Supreme Court Rejects NTR Universitys Plea
  • ఎంబీబీఎస్ సీటు నిరాకరించిన కారణంగా విద్యార్థినికి రూ.7 లక్షలు పరిహారం చెల్లించాలని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించిన హైకోర్టు
  • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం
  • హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు 
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీట్ కౌన్సిలింగ్ – 2022లో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

వివరాల్లోకి వెళితే.. వైద్య విద్యలో ప్రవేశాల కోసం 2022లో నీట్ రాసిన నెల్లూరుకు చెందిన రేవూరు వెంకట ఆశ్రిత ఎన్‌సీసీ ఓపెన్ మహిళా కేటగిరీ కింద ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌సీసీ‌లో తనకంటే తక్కువ మెరిట్, నీట్‌లో తక్కువ మార్కులు వచ్చిన మరో విద్యార్థినికి నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో సీటు కేటాయించడంతో ఆశ్రిత హైకోర్టును ఆశ్రయించారు.

కేసును విచారించిన హైకోర్టు ఆశ్రిత కంటే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థినికి సీటు కేటాయించడం చట్టవిరుద్ధమని ఫిబ్రవరి 20న తేల్చి చెప్పింది. అంతేకాకుండా వర్శిటీ అధికారుల చర్యలతో ఎంబీబీఎస్ సీటు కోల్పోయి డెంటల్ కోర్సులో చేరిన ఆశ్రితకు నష్టపరిహారంగా రూ.7 లక్షలు చెల్లించాలని వైద్య విశ్వవిద్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మార్చి 6న ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పీల్‌లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు హైకోర్టు తీర్పును ఉదహరణగా చూపి భవిష్యత్తులో ఇతరులెవరూ పరిహారం పొందడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. 
NTR University of Health Sciences
Supreme Court
Andhra Pradesh High Court
NEET Counselling
MBBS Seat
Medical College
Compensation
Student
Narasaraopet Venkata Ashrita
Medical Education

More Telugu News