Deepa Balu: ఎవరీ దీపా బాలు? ఎందుకింత క్రేజ్?

- తంజావూరులో పుట్టిపెరిగిన దీపా బాలు
- నటన పట్ల పెరుగుతూ వచ్చిన ఆసక్తి
- 'హార్ట్ బీట్'తో అందరి దృష్టిలోకి
- ఈ నెల 22 నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్
- త్వరలో సినిమాల్లో బిజీ అయ్యే ఛాన్స్
దీపా బాలు .. ఇప్పుడు యూత్ లో ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగని చెప్పేసి ఈ అమ్మాయి రీసెంట్ సినిమా ఏదైనా హిట్ అయిందా అంటే, అలాంటిదేం లేదు. కేవలం ఒక వెబ్ సిరీస్ తో ఈ బ్యూటీ ఈ స్థాయి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ సిరీస్ పేరే 'హార్ట్ బీట్'. హాట్ స్టార్ లో క్రితం ఏడాది ఈ మెడికల్ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ అయింది. సీజన్ 1 గా 100 ఎపిసోడ్స్ తో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్ లోనే దీపా బాలు 'రీనా' అనే ప్రధానమైన పాత్రను పోషించింది.
ఈ సిరీస్ లో చాలా పాత్రలు ఉంటాయి. అయితే కథ అంతా కూడా దీపా బాలు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. 'రీనా' అనే పాత్రలో ఈ అమ్మాయి నటన హ్యాట్సాఫ్ అనిపిస్తుంది. అంత సహజంగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. చిన్నప్పుడే తల్లి ప్రేమకి దూరమై .. ఆ తరువాత తన తల్లి ఎవరో తెలుసుకుని ఆమె దగ్గరికి చేరుకుని .. తన ఫ్యామిలీకి దూరంగా ఉండమని తన తల్లితోనే అనిపించుకుని మానసిక వేదనకి దూరమయ్యే పాత్రలో దీపా బాలు నటన ప్రేక్షకులను కదిలించింది.
ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సిరీస్ నుంచి సీజన్ 2 రానుంది. ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకు కారణం దీపా బాలుయేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళనాడు ... తంజావూరులో పుట్టిపెరిగిన దీపా బాలు ఎంబీబీఎస్ చేసింది. నటనపట్ల ఉన్న ఆసక్తికరంగా ఈ దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువే. ఆకర్షణీయమైన కళ్లతో అన్నిరకాల హావభావాలను సహజంగా పలికించడమే ఆమె ప్రత్యేకత. 'హార్ట్ బీట్' సీజన్ 2 తరువాత దీపా బాలు సినిమాలలో బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.

