Badar Khan Suri: అమెరికా న్యాయ‌స్థానంలో భార‌త విద్యార్థికి భారీ ఊర‌ట‌.. కోర్టు కీల‌క ఆదేశాలు

US Court Orders Release of Indian Student Badar Khan Suri Accused of Hamas Ties
  • హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నార‌న్న ఆరోపణ‌లు 
  • అమెరికాలో అరెస్ట‌యిన‌ భార‌త విద్యార్థి బ‌ద‌ర్ ఖాన్ సురి
  • నిర్బంధంలో ఉన్న అత‌డిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశాలు
హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నార‌న్న ఆరోపణ‌ల‌పై అమెరికాలో అరెస్ట‌యిన‌ భార‌త విద్యార్థి బ‌ద‌ర్ ఖాన్ సురికి అక్క‌డి న్యాయ‌స్థానంలో భారీ ఊర‌ట ల‌భించింది. నిర్బంధంలో ఉన్న సురిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. అత‌డిని టెక్సాస్ నుంచి వ‌ర్జీనియాకు వెళ్లేందుకు అనుమ‌తించాల‌ని డిస్ట్రిక్ట్ జ‌డ్జి త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. 

వాషింగ్టన్‌ డీసీలోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌ విద్యార్థిగా ఉన్న బదర్‌ ఖాన్‌ సురి హమాస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఆరోపించింది. అతడికి హమాస్‌లోని పలువురితో సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో అతడి వీసాను రద్దు చేసి, వర్జీనియాలోని నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు.  

దీంతో తన అరెస్టును సవాల్‌ చేస్తూ సురి కోర్టును ఆశ్రయించాడు. ఇది పూర్తిగా రాజకీయకుట్ర అని తన పిటిషన్‌లో ఆరోపించాడు. విచారణ జరిపిన ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ వర్జీనియా కోర్టు అతడికి తాత్కాలిక ఉపశమనం కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు అత‌డిని అమెరికా నుంచి బహిష్కరించకూడదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం సురిని లూసియానాలోని ఇమిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచినట్లు అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్ వెల్లడించింది. ఇప్పుడు అక్క‌డి నుంచి వెంట‌నే అత‌డిని విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ను కోర్టు ఆదేశించింది. 
Badar Khan Suri
Indian Student
US Court
Hamas
Arrest
Visa Cancellation
Immigration Detention
Virginia Court
Department of Homeland Security
Georgetown University

More Telugu News