WTC 2025: డ‌బ్ల్యూటీసీ విన్న‌ర్‌కు ఈసారి భారీ ప్రైజ్‌మ‌నీ... గ‌త ఎడిష‌న్ల‌తో పోలిస్తే డ‌బుల్‌!

WTC Final Prize Money Doubled
  • లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్
  • జూన్ 11 నుంచి 15వ తేదీ వ‌ర‌కు మెగా స‌మ‌రం 
  • ఫైన‌ల్‌లో నెగ్గిన జ‌ట్టుకు రూ. 30.79 కోట్ల ప్రైజ్‌మ‌నీ
  • ఓడిన జ‌ట్టుకు రూ. 17.96 కోట్లు
  • 2023లో విజేత‌కు రూ. 13.68 కోట్ల ప్రైజ్‌మ‌నీ
వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు చెందిన ప్రైజ్‌మ‌నీని తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించింది. గ‌త టోర్నీల‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్‌మ‌నీని రెండింత‌లు పెంచేసింది. లండ‌న్‌లోని ప్ర‌ఖ్యాత లార్డ్స్ మైదానంలో జూన్ 11వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ ఫైన‌ల్‌ నెగ్గిన జ‌ట్టుకు 3.6 మిలియ‌న్ల డాల‌ర్ల (రూ. 30.79 కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌నుంది. ఇక ఫైన‌ల్లో ఓడిన జ‌ట్టుకు 2.1 మిలియ‌న్ల డాల‌ర్ల (రూ. 17.96 కోట్లు) ప్రైజ్‌మ‌నీ అందుతుంది. 

కాగా, 2023లో భార‌త జ‌ట్టుపై ఫైన‌ల్లో గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియ‌న్ల డాల‌ర్ల (రూ. 13.68 కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. అలాగే ర‌న్న‌ర‌ప్ టీమిండియాకు 8 ల‌క్ష‌ల డాల‌ర్లు (రూ. 6.84 కోట్లు) ఇచ్చారు. టెస్టు క్రికెట్ ప్రాముఖ్య‌త‌ను పెంచే ఉద్దేశంతో ప్రైజ్‌మ‌నీ పెంచిన‌ట్లు ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

డ‌బ్ల్యూటీసీ సీజన్ లో ఈసారి ద‌క్షిణాఫ్రికా అగ్ర‌స్థానంలో నిలిచింది. శ్రీలంక‌, పాకిస్థాన్‌తో జ‌రిగిన హోం సిరీస్‌ల‌లో స‌ఫారీలు విజ‌యాలు సాధించ‌డం క‌లిసొచ్చింది. దాంతో 69.44 శాతం పాయింట్ల‌తో టేబుల్‌లో తొలి స్థానం కైవ‌సం చేసుకుంది. ఇక‌, డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉంది. 50.00 పాయింట్ల‌తో భార‌త్ మూడో స్థానానికి ప‌రిమిత‌మైంది.

ఇక‌, లార్డ్స్‌లో ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ద‌క్కించుకుంటే అదో మ‌రుపురాని అనుభూతిగా మిగిలిపోతుంద‌ని ఆసీస్ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ అన్నాడు. రెండేళ్లుగా డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌కు చేర‌డానికి తాము చాలా శ్ర‌మించామ‌ని, త‌మ శ్ర‌మ‌కు ఫ‌లితం ద‌క్కింద‌ని పేర్కొన్నాడు. 

అటు ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడుతూ... డ‌బ్ల్యూటీసీ ద్వారా టెస్ట్ క్రికెట్‌కు ప్రాముఖ్య‌త పెరుగుతుంద‌ని తెలిపాడు. ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ద్వారా లాంగ్ ఫార్మాట్‌కు ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. డ‌బ్ల్యూటీసీ మెగా ఫైనల్‌కి లార్డ్స్ స‌రైన వేదిక అని అభిప్రాయ‌ప‌డ్డాడు. ఆస్ట్రేలియాపై అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌న్నాడు. 
WTC 2025
ICC World Test Championship
WTC Final
Prize Money
Australia
South Africa
Pat Cummins
Temba Bavuma
Lord's Cricket Ground
Test Cricket
Cricket

More Telugu News