Gurugram: సమోసా విషయంలో త‌లెత్తిన‌ ఘర్షణ... షాపు యజమానిని కాల్చి చంపిన క‌స్ట‌మ‌ర్‌!

Samosa Dispute Leads to Murder in Gurugram
  • హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన 
  • రాకేశ్ అనే వ్యక్తికి ఫరూఖ్‌నగర్ ప్రాంతంలో టీ స్టాల్ 
  • ఈ నెల 12న ఆ టీ స్టాల్‌కి వ‌చ్చిన పాత నేరస్తుడు పంకజ్ 
  • సమోసా విషయమై రాకేశ్‌తో ఘ‌ర్ష‌ణ‌
  • ఆ త‌ర్వాతి రోజు టీ స్టాల్‌కి వ‌చ్చి రాకేశ్ పై పంక‌జ్ కాల్పులు
సమోసా విషయంలో తలెత్తిన‌ ఘర్షణ ఓ వ్య‌క్తి ప్రాణాలు తీసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... రాకేశ్ అనే వ్యక్తికి ఫరూఖ్‌నగర్ ప్రాంతంలో టీ స్టాల్ ఉంది. ఈ నెల 12న పాత నేరస్తుడైన పంకజ్ తన అనుచరులతో కలిసి ఆ టీ స్టాల్‌ కు వచ్చాడు. ఈ క్ర‌మంలో సమోసా విషయమై రాకేశ్‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగాడు. అదే స‌మ‌యంలో అక్కడకు వచ్చిన పోలీసులు పంకజ్‌ను హెచ్చరించి అక్కడి నుంచి పంపేశారు.

అయితే, ఆ త‌ర్వాతి రోజు పంకజ్‌ తన అనుచరులతో కలిసి మ‌ళ్లీ రాకేశ్‌ టీ స్టాల్‌ వద్దకు వచ్చాడు. ఆ త‌ర్వాత త‌న‌తో పాటు తెచ్చుకున్న తుపాకీతో రాకేశ్‌పై ఆరుసార్లు కాల్పులు జరిపాడు. అత‌డు చ‌నిపోయాడ‌ని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. 

ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గుర‌య్యారు. ఫరూఖ్‌నగర్-ఝజ్జర్ రహదారిని దిగ్బంధించారు. వ్యాపారులు తమ షాపులను మూసివేసి నిరసన తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేయాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇక‌, స్థానికులు నిర‌స‌న తెలుపుతున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు... వారిని సర్ది చెప్పారు. నిందితులను 48 గంట‌ల్లో అదుపులోకి తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. రాకేశ్‌ హత్యపై కేసు నమోదు చేసినట్లు పోలీస‌లులు తెలిపారు. పంకజ్‌తో పాటు అతడి అనుచరులను అరెస్ట్‌ చేసేందుకు పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు పోలీసుల నిర్లక్ష్యంపై మృతుడు రాకేశ్‌ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. పంకజ్‌పై ఈ నెల 12 (సోమవారం)నే చర్యలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని వారు వాపోయారు. ఇప్పుడు త‌మ‌కు న్యాయం చేసేది ఎవ‌రంటూ కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీరు అవుతున్నారు. 
Gurugram
Farrukhnagar
Haryana
Murder
Samosa Dispute
Customer Shoots Shop Owner
India Crime News
Police Inaction

More Telugu News