Nara Lokesh: ప్రతిపక్షంలో ఉన్నప్పటి కసితో పనిచేయాలి: మంత్రి నారా లోకేశ్

Nara Lokeshs Call to TDP Workers Work with Opposition Like Zeal
  • ఉత్తమ కార్యకర్తల సమావేశంలో నారా లోకేశ్ ప్రసంగం
  • 11 నెలల ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
  • ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని కర్తవ్యబోధ
రాష్ట్ర ప్రభుత్వం గత 11 నెలల్లో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి కసితో పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "బాబు సూపర్-6', 'బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ'లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం," అని తెలిపారు. 11 నెలల ప్రజా ప్రభుత్వంలో వృద్ధాప్య పింఛన్‌ను రూ.4 వేలకు, వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పింఛన్ ఇవ్వడం లేదని గుర్తుచేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని, ఉచిత గ్యాస్ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, జూన్ మాసంలో 'తల్లికి వందనం', 'అన్నదాత సుఖీభవ' పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

పాఠశాలలను మూసివేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని లోకేశ్ కార్యకర్తలకు సూచించారు. "ఒక్క పాఠశాలనూ మూసివేయడం లేదు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం" అని ఆయన అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో చేయలేని పనులను తమ ప్రభుత్వం 11 నెలల్లోనే చేసి చూపిందని, 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చామని తెలిపారు.

చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయని, అనంతపురానికి రూ.22 వేల కోట్ల భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టు, విశాఖకు టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ వస్తున్నాయని, రాబోయే ఐదేళ్లలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, జనసేన పార్టీలతో కూటమి పటిష్టంగా ఉందని, నామినేటెడ్ పదవుల విషయంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని, కార్యకర్తల త్యాగాల వల్లే చారిత్రక విజయం సాధ్యమైందని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని ఆయన పునరుద్ఘాటించారు.
Nara Lokesh
TDP
Andhra Pradesh
Welfare Schemes
Pension Increase
Anna Canteen
Mega DSC
Chandrabbabu Naidu
IT Minister
BJP-Janasena alliance

More Telugu News