Kangana Ranaut: ట్రంప్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ట్వీట్.. బీజేపీ అధ్యక్షుడి ఆదేశాలతో డిలీట్!

Kangana Ranauts Tweet on Trump and Tim Cook Deleted After BJP Presidents Intervention
  • ఆపిల్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై కంగనా సోషల్ మీడియా పోస్ట్
  • మోదీతో ట్రంప్‌ను పోలుస్తూ వ్యక్తిగత అభిప్రాయ వెల్లడి
  • బీజేపీ చీఫ్ జేపీ నడ్డా జోక్యం, పోస్ట్ తొలగించాలని సూచన
  • వెంటనే స్పందించిన కంగనా, ఎక్స్, ఇన్‌స్టా నుంచి డిలీట్
  • వ్యక్తిగత అభిప్రాయమని, విచారం వ్యక్తం చేసిన నటి
బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ఒక పోస్ట్ చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆపిల్ సంస్థ భారత్‌లో తయారీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై కంగనా తనదైన శైలిలో స్పందించారు. అయితే, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జోక్యంతో ఆమె ఆ పోస్టును తొలగించాల్సి వచ్చింది.

భారత్‌లో ఆపిల్ సంస్థ తయారీ కార్యకలాపాలు చేపట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కంగనా రనౌత్ గురువారం ఒక పోస్ట్ చేశారు. అందులో ట్రంప్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీని పోల్చుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ వైరల్ అయిన కాసేపటికి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా కంగనాకు ఫోన్ చేసి, ఆ పోస్టును తొలగించాలని కోరారు.

ఈ విషయాన్ని కంగనా రనౌత్ స్వయంగా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. "గౌరవనీయులైన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాకు ఫోన్ చేసి, ట్రంప్ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో భారత్‌లో తయారీ చేపట్టవద్దని అన్నట్లు నేను పోస్ట్ చేసిన ట్వీట్‌ను తొలగించమని కోరారు. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పోస్ట్ చేసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన సూచనల మేరకు, నేను వెంటనే దాన్ని ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా తొలగించాను. ధన్యవాదాలు" అని కంగనా మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

కంగనా రనౌత్ తొలగించిన పోస్టులో, ట్రంప్ వ్యాఖ్యల వెనుక కారణాలపై ఇవి అంటూ రాసుకొచ్చారు. "ఈ ప్రేమ తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది? 1) ఆయన అమెరికా అధ్యక్షుడు కానీ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన నేత భారత ప్రధాని. 2) ట్రంప్‌ది రెండో పర్యాయం అయితే, భారత ప్రధాని మూడోసారి గెలిచారు. 3) నిస్సందేహంగా ట్రంప్ ఆల్ఫా మేల్, కానీ మన ప్రధాని అందరు ఆల్ఫా మేల్స్‌కూ బాస్. మీరేమనుకుంటున్నారు? ఇది వ్యక్తిగత అసూయనా లేక దౌత్యపరమైన అభద్రతా?" అని కంగనా ప్రశ్నించినట్లుగా సమాచారం.
Kangana Ranaut
BJP
Donald Trump
Tim Cook
Apple
India Manufacturing
JP Nadda

More Telugu News