Renu Desai: అర్థం లేని చర్చలు మాని ఇలా చేయండి... నటి రేణుదేశాయ్ పిలుపు

Renu Desai Urges Boycott of Chinese Products
  • చైనా ఉత్పత్తులు కొనడం మానేయాలని రేణు దేశాయ్ విజ్ఞప్తి
  • దేశం, కుటుంబ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని సూచన
  • వస్తువు కొనే ముందు లేబుల్ చదవడం అలవాటు చేసుకోవాలన్న రేణు దేశాయ్
  •  తాను కూడా చైనా వస్తువులు కొనడం మానేస్తున్నట్లు వెల్లడి
సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే నటి రేణు దేశాయ్. తాజాగా మరో కీలకమైన విజ్ఞప్తితో ముందుకొచ్చారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చైనా ఉత్పత్తుల వాడకాన్ని మానేయాలని ప్రజలను కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

దేశ భద్రత, కుటుంబ శ్రేయస్సు నిజంగా మనకు ముఖ్యమైతే చైనాలో తయారైన చిన్న వస్తువును కూడా కొనడం ఆపేయాలని రేణు దేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "ఏదైనా వస్తువు కొనే ముందు దాని లేబుల్‌ను ఇప్పటినుంచైనా చదవడం ప్రారంభించండి. చైనా ఉత్పత్తులను కొనడం మానేశామని అందరికీ తెలిసేలా చేయండి" అని సూచించారు. తాను కూడా ఇప్పటివరకు చైనాలో తయారైన వస్తువులు కొన్నప్పటికీ, ఇటీవల ప్రతి వస్తువుపై ఉండే లేబుల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తెలిపారు. ఒకవేళ అది చైనాలో తయారైనట్లు తేలితే, దాన్ని కొనకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదని, సుదీర్ఘమైన ప్రక్రియ అని అంగీకరిస్తూనే, కనీసం ఇప్పటినుంచైనా ఈ మార్పును ప్రారంభిద్దామని రేణు పిలుపునిచ్చారు. "మీరు కొనాలనుకునే వస్తువు ఎక్కడ తయారైందో తెలుసుకోండి. మన దేశాన్ని ఆదరిద్దాం" అని ఆమె రాసుకొచ్చారు.

ఈ సందేశాన్ని ప్రతిఒక్కరూ షేర్ చేయాలని కోరుతూ "మనమందరం ఎక్కడో ఒకచోట దీన్ని ప్రారంభించాలి. మన దేశానికి, మన మాతృభూమికి మనం మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి. అర్థం లేని టీవీ రియాలిటీ షోల గురించి, అనవసరమైన రూమర్ల గురించి మాట్లాడుకోవడం కంటే, మన దేశ పరిస్థితి గురించి చర్చించుకోవడం మొదలుపెడదాం" అని రేణు దేశాయ్ పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఆలోచించాలని ఆమె కోరారు.
Renu Desai
Boycott China
China Products
Indian Actress
Social Responsibility
Swadeshi Movement
Made in India
China Boycott Appeal
Renu Desai Appeal
Support Indian Economy

More Telugu News