Buchibabu: నేను సినిమాల్లోకి రావ‌డం అంత ఈజీగా జ‌ర‌గ‌లేదు: బుచ్చిబాబు

Buchi Babu Sanas Journey From MBA to Tollywood Success
  • 'ఉప్పెన‌'తో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు 
  • ప్ర‌స్తుతం రామ్ చరణ్ హీరోగా 'పెద్ది' సినిమా చేస్తున్న డైరెక్ట‌ర్‌
  • త‌న సినీ కెరీర్ గురించి తాజాగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్న బుచ్చిబాబు  
'ఉప్పెన‌'తో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా తొలి చిత్రంతోనే సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'పెద్ది' అనే సినిమా కోసం పనిచేస్తున్న విష‌యం అందరికీ తెలిసిందే. పెద్ది ఫస్ట్ షాట్ అంటూ రిలీజ్ చేసిన‌ గ్లింప్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. దీంతో బుచ్చిబాబు రెండో సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. 

అయితే, త‌న సినీ కెరీర్ గురించి తాజాగా బుచ్చిబాబు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాను సినిమాల్లోకి రావ‌డం అంత ఈజీగా జ‌ర‌గ‌లేద‌న్నారు. సినిమాల్లోకి అడుగుపెట్టాల‌నుకున్న‌ప్పుడు త‌న కుటుంబస‌భ్యులు మ‌ద్ధ‌తు ఇవ్వలేద‌ని, వారి కోస‌మే ఎంబీఏలో చేరిన‌ట్లు చెప్పారు. 

బుచ్చిబాబు మాట్లాడుతూ... "మొద‌టి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాల‌ని ఆశ‌గా ఉండేది. కానీ, ఇంట్లో వాళ్లు మాత్రం అందుకు అంగీక‌రించ‌లేదు. నేను బాగా చ‌దువుకుని సెటిల్ అయితే చూడాల‌నేది వారి కోరిక. నా సోద‌రి ప్లాస్టిక్ స‌ర్జ‌న్‌. వాళ్ల‌ను నొప్పించ‌డం ఇష్టంలేక హైద‌రాబాద్‌లోని ఒక క‌ళాశాల‌లో ఎంబీఏలో చేరా. మ‌ధ్యాహ్నం వ‌రకు క్లాసుల‌కు వెళ్లి... ఆ త‌ర్వాత నాకు ఇష్ట‌మైన సినిమాపై దృష్టిసారించేవాడిని. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు సుకుమార్ వ‌ద్ద ప‌నిచేశా. ఆయ‌న తెర‌కెక్కించిన 100% ల‌వ్‌, ఆర్య‌2, రంగ‌స్థ‌లం చిత్రాల‌కు అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా వ‌ర్క్ చేశా" అని అన్నారు. 

ఆ త‌ర్వాత 'పెద్ది' గురించి మాట్లాడుతూ... "ఈ మూవీలో క్రికెట్ కేవ‌లం బ్యాక్‌డ్రాప్ మాత్ర‌మే. ఎమోష‌న్ ఎంతో ముఖ్యం. విజ‌య‌న‌గ‌రం, ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంది. కొన్నేళ్ల క్రిత‌మే ఈ సినిమా క‌థ రాసుకున్నా. రామ్ చ‌ర‌ణ్ సినిమా కోసం బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు రెహ‌మాన్ ఒక్కో పాట‌కు 20 నుంచి 30 ఆప్ష‌న్స్ మాకు ఇస్తున్నారు. అలాగే సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది" అని బుచ్చిబాబు చెప్పారు.

ఇక, ఈ మూవీలో చెర్రీ స‌ర‌స‌న జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే  జగపతి బాబు, శివరాజ్ కుమార్‌, మీర్జా పూర్ ఫేమ్ మున్నా భాయ్ అలియాస్ దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Buchibabu
Uppena Director
Peddi Movie
Ram Charan
Janhvi Kapoor
Tollywood
Telugu Cinema
Sukumar
A.R. Rahman
Film Career

More Telugu News