Bengaluru Techie: పట్టుమని 30 ఏళ్లు రాకముందే కోటి సంపాదన కళ్లజూసిన బెంగళూరు టెక్కీ

Bengaluru Techie Achieves Crorepathi Status Before 30
* రూ.2.4 లక్షల వార్షిక వేతనంతో కెరీర్ ప్రారంభం
* ప్రస్తుతం రూ.50 లక్షల వరకు వార్షిక ఆదాయం
* తక్కువ ఆదాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు
* పొదుపు, పెట్టుబడులతో ఆర్థిక క్రమశిక్షణ
* సాధారణ జీవనశైలి, యువతకు స్ఫూర్తి
బెంగళూరుకు చెందిన ఓ యువ టెక్ నిపుణుడు, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, 30 ఏళ్లు నిండకముందే కోటి రూపాయల నికర ఆస్తిని సంపాదించిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'రెడిట్' అనే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోని 'పర్సనల్ ఫైనాన్స్ ఇండియా' సబ్‌రెడిట్‌లో అతను తన ఆర్థిక ప్రయాణాన్ని పంచుకున్నాడు. ఈ కథనం ఎంతో మంది యువకులకు స్ఫూర్తినిస్తోంది.

సాధారణ ఆరంభం, అసాధారణ ఎదుగుదల
2018లో, తన 23వ ఏట, కేవలం రూ.2.4 లక్షల వార్షిక వేతనంతో (నెలకు సుమారు రూ.15,000) తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినట్లు ఆ టెకీ తెలిపాడు. తనది తక్కువ ఆదాయ కుటుంబమని, తండ్రి నెలకు రూ.7,000 నుంచి రూ.8,000, తల్లి రూ.5,000 నుంచి రూ.7,000 సంపాదించేవారని గుర్తుచేసుకున్నాడు. తాను నెలకు రూ.1,200 ఫీజు చెల్లించే ఓ మోస్తరు ప్రైవేటు పాఠశాలలో చదివానని, 10వ తరగతి, 12వ తరగతిలో పెద్దగా కష్టపడకుండానే 89% మార్కులు సాధించానని చెప్పాడు.

విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం
జేఈఈ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి, తన ఇంటికి దగ్గరగా బస్ సౌకర్యం ఉన్న ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చేరానని తెలిపాడు. "కాలేజీ ఫీజులు కట్టడం కష్టంగా ఉండేది, లోన్లు కూడా తిరస్కరించారు, కానీ బంధువులు ఆదుకున్నారు" అని వెల్లడించాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) చదివినప్పటికీ, మూడో సంవత్సరం వచ్చేసరికి ప్రోగ్రామింగ్ వైపు ఆసక్తి మళ్లిందని, కోడింగ్ నేర్చుకోవడంపై దృష్టి సారించానని చెప్పాడు. ఫైనల్ ఇయర్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఓ సర్వీస్ ఆధారిత కంపెనీకి ఎంపికయ్యానని, అప్పటినుంచి తన ప్రస్థానం మొదలైందని వివరించాడు.

ఆర్థిక ప్రణాళిక, జీవనశైలి
బెంగళూరులో ఉద్యోగ జీవితం ప్రారంభించిన తొలినాళ్లలో నెలకు రూ.2,000 ఆదా చేసేవాడినని తెలిపాడు. కరోనా సమయంలో ఓ పెద్ద కంపెనీ నుంచి వచ్చిన జాబ్ ఆఫర్ చేజారినా, ఆ తర్వాత రూ.12 లక్షల వార్షిక వేతనంతో మరో అవకాశం వచ్చిందని, అది తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. 2022లో జాబ్ మార్కెట్ ఊపందుకోవడంతో, ఏకంగా 13 ఆఫర్లు సాధించి, చివరకు రూ.32 లక్షల వార్షిక వేతనంతో ఓ ప్రొడక్ట్ ఆధారిత కంపెనీలో చేరానని చెప్పాడు. స్టాక్ గ్రాంట్స్ కలపడంతో తన వార్షిక ఆదాయం సుమారు రూ.45-50 లక్షలకు చేరిందని వివరించాడు.

ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికీ, తన జీవనశైలి చాలా సాధారణంగా ఉంటుందని ఆ టెకీ స్పష్టం చేశాడు. "నాకు వస్తువులపై ఎప్పుడూ మోజు లేదు. 2019లో కొన్న ఆండ్రాయిడ్ ఫోన్‌నే ఇప్పటికీ వాడుతున్నాను. ఆఫీసులో ఉచితంగా ఇచ్చే టీ-షర్టులు, కొన్ని జుడియో/వెస్ట్‌సైడ్ జీన్స్‌తోనే నా వార్డ్‌రోబ్ నిండి ఉంటుంది. నా బూట్ల ఖరీదు రూ.250 మాత్రమే, కానీ మోకాళ్ల రక్షణ కోసం రూ.1,000 విలువైన షూ సోల్స్ వాడతాను" అని తెలిపాడు. ప్రస్తుతం నెలకు రూ.71,000 సిప్‌ల ద్వారా పెట్టుబడి పెడుతున్నానని, 2023లో రూ.31.6 లక్షలుగా ఉన్న తన పోర్ట్‌ఫోలియో విలువ, ప్రస్తుతం రూ.100.77 లక్షలకు (కోటి రూపాయలకు పైగా) చేరిందని వెల్లడించాడు.

యువతకు సందేశం
"ఇది గొప్ప చెప్పుకోవడానికి కాదు, నా కథ మాత్రమే" అంటూ తన పోస్ట్‌ను ప్రారంభించిన ఆ యువకుడు, రాబోయే సంవత్సరాల్లో చివరిసారిగా ఉద్యోగం మారి, 45 ఏళ్లలోపు రిటైర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు. యువ నిపుణులకు సలహా ఇస్తూ, "ఎప్పుడూ ముందుకు సాగుతూ ఉండండి. అవసరమైన చోట పొదుపుగా ఉండండి, ముఖ్యమైన వాటిపై ఖర్చు చేయండి. ఆర్థికంగా, కెరీర్ పరంగా కాంపౌండింగ్ శక్తిని తక్కువ అంచనా వేయకండి. అన్నింటికంటే ముఖ్యంగా, వినయంగా ఉండండి" అని హితవు పలికాడు.
Bengaluru Techie
Millionare Techie
Early Retirement
Personal Finance
Investment Strategies
Financial Success
Coding
Software Engineer
Reddit
India

More Telugu News