Danujay Reddy: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం... ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్

AP Liquor Scam Danujay Reddy Krishna Mohan Reddy Arrested
  • మూడు రోజుల సిట్ విచారణ అనంతరం అరెస్టు చేసిన అధికారులు
  • ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • ఈ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి 
ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ విచారణ అనంతరం, నాటి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్‌రెడ్డితో పాటు, అప్పటి సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు వీరిని విచారించిన సిట్ అధికారులు, మద్యం కుంభకోణంలో వీరి ప్రమేయంపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ సాయంత్రం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు వీరిద్దరినీ సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.

ఈ కేసులో ధనుంజయ్‌రెడ్డి ఏ31 నిందితుడిగా, కృష్ణమోహన్‌రెడ్డి ఏ32 నిందితుడిగా ఉన్నారు. కాగా, ఇదే కేసులో వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఈ సమయంలో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని జస్టిస్ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే అది దర్యాప్తు అధికారి విచారణకు ఆటంకం కలిగించినట్లు అవుతుందని అభిప్రాయపడింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వీరి ముందస్తు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, రెగ్యులర్ బెయిల్ కోసం నిబంధనలు, మెరిట్స్ ఆధారంగా హైకోర్టు లేదా ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో, నాటి సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డితో పాటు భారతి సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీలను కూడా సిట్ ఇటీవల నిందితుల జాబితాలో చేర్చింది. ఈ కేసులో ఏ33 నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు మంగళవారమే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

గతంలో ఈ కేసుకు సంబంధించి మే 16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సిట్‌ కార్యాలయంలో గత మూడు రోజులుగా వీరి విచారణ కొనసాగింది. తాజాగా సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో వీరి అరెస్టుకు మార్గం సుగమమైంది.
Danujay Reddy
Krishna Mohan Reddy
AP Liquor Scam
SIT Arrest
Andhra Pradesh
Supreme Court
Bail Rejection
Vijayawada
Liquor Scandal
Govindappa Balaji

More Telugu News