Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా.. కెరీర్‌లోనే తొలిసారి 90 మీటర్ల మార్క్‌!

Neeraj Chopras Career Best Throw in Doha Diamond League
  • దోహా డైమండ్‌ లీగ్‌లో కదంతొక్కిన‌ భారత గోల్డెన్‌ బాయ్‌
  • 90.23 మీటర్లతో సరికొత్త రికార్డు
  • 91.06 మీటర్లతో చోప్రాను దాటేసి విజేత‌గా నిలిచిన‌ వెబర్‌
భారత గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా కొత్త చరిత్ర లిఖించాడు. జావెలిన్‌త్రోలో సరికొత్త రికార్డుతో నీరజ్ దోహా డైమండ్‌ లీగ్‌లో కదంతొక్కాడు. శుక్రవారం దోహా వేదికగా మొదలైన ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో నీరజ్ త‌న కెరీర్‌లోనే తొలిసారి 90.23 మీటర్ల మార్క్‌ అందుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఊరిస్తున్న 90 మీటర్ల దూరాన్ని ఎట్ట‌కేల‌కు అందుకున్నాడు. 

ఈ క్రమంలో గతంలో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (89.94మీ)ను చోప్రా దాటేశాడు. ఇక‌, నిన్న‌టి పోటీలో తన మొదటి ప్రయత్నంలోనే బ‌ల్లెంను 88.44 మీటర్ల దూరం విసిరిన‌ ఈ స్టార్‌ అథ్లెట్‌... రెండో ప్రయత్నంలో ఫౌల్‌ అయ్యాడు. అయితే, మూడో ప్రయత్నంలో అద్భుతం చేసి చూపించాడు. ఇన్నాళ్లుగా అందినట్లే అంది దూరమవుతున్న 90 మీటర్ల దూరాన్ని ఒడిసిపట్టుకున్నాడు.

అయితే, అదే జోరును కొనసాగించడంలో చోప్రా ఒకింత విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో 80.56 మీటర్లు విసిరిన నీరజ్‌ ఐదోసారి మ‌ళ్లీ ఫౌల్‌ అయ్యాడు. ఆఖరిదైన ఆరో త్రోలో నీరజ్‌ 88.20 మీటర్లకే పరిమితమయ్యాడు. ఇదే అదనుగా అప్పటి వరకు చోప్రా దరిదాపుల్లోనే ఉన్న జ‌ర్మ‌నీకి చెందిన అథ్లెట్ జులియన్‌ వెబర్‌ ఆరో ప్రయత్నంలో బ‌ల్లెంను ఏకంగా 91.06 మీటర్లు విసిరాడు. దీంతో టాప్‌లోకి దూసుకొచ్చాడు. కెరీర్‌లో తొలిసారి అత్యుత్తమ మార్క్‌ అందుకున్న వెబర్‌... నీరజ్‌ను దాటేసి విజేత‌గా నిలిచాడు. వీరిద్ద‌రి త‌ర్వాత‌ అండర్సన్‌ పీటర్స్ 85.64 మీట‌ర్లతో మూడో స్థానం కైవ‌సం చేసుకున్నాడు.

నీరజ్ చోప్రా కెరీర్‌లో టాప్-5 త్రోలు ఇవే..
90.23మీ* (దోహా డైమండ్ లీగ్ 2025)
89.94మీ (స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ 2022)
89.49మీ (లౌసాన్ డైమండ్ లీగ్ 2024)
89.45 మీ (పారిస్ ఒలింపిక్స్ 2024 - ఫైనల్)
89.34 మీ (పారిస్ ఒలింపిక్స్ 2024 - క్వాలిఫైయర్)
Neeraj Chopra
Javelin Throw
Doha Diamond League
90 Meter Throw
National Record
Julian Weber
Athletics
Indian Athlete
Diamond League 2025
Sports Record

More Telugu News