NIA: ముంబై ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్

Two ISIS Terrorists Arrested at Mumbai Airport
  • ఇండోనేషియా నుంచి రాగానే అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
  • ఐసిస్ స్లీపర్ సెల్‌తో వీరికి సంబంధాలున్నట్లు గుర్తింపు
  • పుణె ఐఈడీ కేసులోనూ వీరి ప్రమేయం, తలకు రూ.3 లక్షల రివార్డు
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్‌కు వచ్చిన అబ్దుల్లా ఫయాజ్‌ షేక్ అలియాస్ డైపర్‌వాలా, తల్హా ఖాన్‌ అనే ఇద్దరు వ్యక్తులు విమానాశ్రయంలోని టెర్మినల్ 2 వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఇమిగ్రేషన్ బ్యూరో అధికారులు వారిని నిలిపివేశారు. అనంతరం ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగి వారిని అరెస్ట్ చేశారు. వీరికి ఐసిస్ స్లీపర్ సెల్‌ విభాగంతో సంబంధాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

2023లో మహారాష్ట్రలోని పుణెలో పేలుడు పదార్థాల (ఐఈడీలు) తయారీ, పరీక్షలకు సంబంధించిన కేసులో ఈ ఇద్దరి కోసం స్థానిక పోలీసులు అప్పటినుంచే గాలిస్తున్నట్లు తెలిసింది. ఆ సమయంలో వీరు భారత్‌లోని స్లీపర్‌ సెల్స్‌తో కలిసి దేశంలో ఉగ్ర కుట్రలకు ప్రణాళికలు రచించారని, అదే ప్రాంతంలో స్లీపర్‌ సెల్స్‌కు బాంబుల తయారీలో శిక్షణ కూడా ఇచ్చారని అధికారులు పేర్కొన్నారు. వీరిని పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతిని కూడా గతంలో ప్రకటించినట్లు తెలుస్తోంది.

గత రెండేళ్లుగా పరారీలో ఉన్న వీరు, ప్రస్తుతం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ముంబైకి ఎందుకు వచ్చారనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అరెస్టులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 మంది ఐసిస్ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
NIA
ISIS
Mumbai Airport
Terrorists Arrest
Abdullah Fayaz Sheikh
Talha Khan
Sleeper Cell
India-Pakistan Tension
Pune IED Case
National Investigation Agency

More Telugu News