Gangula Kamalakar: రేవంత్ కు ఉత్తమ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది: గంగుల కమలాకర్

Revanth Reddy Faces Threat From Uttam Kumar Reddy Gangula Kamalakar
  • కాంగ్రెస్ సర్కారును కూల్చే ఉద్దేశం మాకు లేదన్న గంగుల
  • ఐదేళ్లు వాళ్లు పాలిస్తేనే ప్రజలకు కేసీఆర్ విలువ తెలుస్తుందని వ్యాఖ్య
  • రేవంత్‌కు సొంత పార్టీ నేతలతోనే అసలు సమస్య అన్న గంగుల
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు ఎంతమాత్రమూ లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ పార్టీ నుంచి కాకుండా, ఆయన సొంత పార్టీ నేతల నుంచే ముప్పు పొంచి ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఐదేళ్ల పాటు పరిపాలిస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని, అప్పుడే కేసీఆర్ పాలన విలువ ఏంటో అర్థమవుతుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లపాటు పాలించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. రేవంత్ ఐదేళ్లు సీఎంగా కొనసాగాలన్నదే తమ అభిమతమని చెప్పారు. అయితే, రేవంత్‌ కి ఆయన సొంత పార్టీ నేతల నుంచే సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా సీనియర్ నేత ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నుంచి ప్రమాదం పొంచి ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉండాలని కేసీఆర్‌ కూడా ఆకాంక్షించారని, తాము కూడా అదే కోరుకుంటున్నామని పునరుద్ఘాటించారు.

కాగా, ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ప్రభుత్వాన్ని కూలగొడితే తమకేం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే, కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని తాము ఆకాంక్షించామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Gangula Kamalakar
Revanth Reddy
Uttam Kumar Reddy
Telangana Politics
Congress Party
BRS Party
Kishan Reddy
Telangana CM
Political Crisis
Indian Politics

More Telugu News