Maheshwar Reddy: హరీశ్, కవిత డమ్మీ అయ్యారు... బీఆర్ఎస్ చీలిపోతుంది: మహేశ్వర్ రెడ్డి

BRS on the Brink of Split Maheshwar Reddys Explosive Claims
  • బీఆర్ఎస్‌లో 'నాలుగు స్తంభాలాట' నడుస్తోందన్న బీజేపీ నేత ఏలేటి
  • హరీశ్ రావు నేతృత్వంలో పార్టీ చీలిక దిశగా అడుగులు వేస్తోందని వ్యాఖ్య
  • కేటీఆర్‌కు అన్నీ కట్టబెట్టడంపై కవిత తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న ఏలేటి
బీఆర్ఎస్ లో తీవ్రమైన అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని, ఇది పార్టీ చీలికకు దారితీయవచ్చని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ చీలిపోయే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. కేవలం పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం చీలిపోవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలోనే తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడి మధ్య తీవ్రమైన విభేదాలున్నాయని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ సభలో కేటీఆర్‌కే పూర్తి ప్రాధాన్యత దక్కిందని, హరీశ్ రావు, కవితలకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని, వారిని డమ్మీలుగా మార్చేశారని విమర్శించారు. కేసీఆర్ కూడా అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని, సభలోనూ ఆయన ఉత్సాహంగా కనిపించలేదని తెలిపారు. తన తర్వాత కేటీఆరేనని కేసీఆర్ పరోక్షంగా ప్రకటించారని, ప్రస్తుతం కేటీఆర్ డిఫాల్ట్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారని అన్నారు.

కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పార్టీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, ఫూలే విగ్రహం ఏర్పాటు వంటి కవిత నిర్ణయాలకు పార్టీ నుంచి మద్దతు లభించలేదని గుర్తుచేశారు. పదవులు, ఆస్తులన్నీ కేటీఆర్‌కే కట్టబెడుతున్నారంటూ కవిత లేఖ ద్వారా తన అసమ్మతిని వ్యక్తం చేశారని, త్వరలోనే ఆ లేఖ బయటకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. తనను రాజకీయంగా అణచివేసేందుకు కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని కవిత ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో హరీశ్ రావు, కవితలు బీఆర్ఎస్‌ను చీల్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లిన వెంటనే, ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల మొదటి వారంలో బీఆర్ఎస్‌లో చీలిక రావచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాయకత్వంలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భావనతోనే హరీశ్ రావు, కవిత ఈ వ్యూహానికి పదునుపెట్టారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. 

Maheshwar Reddy
BRS
Harish Rao
Kavitha
KCR
KTR
Telangana Politics
Party Split
Factionalism
Revanth Reddy

More Telugu News