Hyderabad Meteorological Department: తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!

Telangana Braces for Three Days of Thunderstorms and Heavy Rain
  • తెలంగాణలో రాబోయే మూడు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు
  • నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
  • గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, శనివారం, ఆదివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు. సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందని... నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు సగటు సముద్ర మట్టం నుండి 1.5 నుండి 5.8 కి మీ ఎత్తులో కొనసాగుతోందని వివరించింది. దానికితోడు కోస్తా ఆంధ్ర తీరం వద్ద  ద్రోణి కూడా ఏర్పడినట్టు తెలిపింది.
Hyderabad Meteorological Department
Telangana Rains
Heavy Rainfall Telangana
Thunderstorms Telangana
Telangana Weather Forecast
Three-Day Rain Forecast
South West Monsoon
Telangana Weather Update
Windy Rain Telangana

More Telugu News