Noida children: పెంపుడు కుక్క ప్రాణం కోసం పిల్లల ఆరాటం.. వైరల్ వీడియో

Noida Childrens Act of Kindness for Injured Dog Goes Viral
  • నోయిడాలో చిన్నారుల గొప్ప మనసు.. తమ కుక్క కోసం తాపత్రయం
  • ఎండలో ట్రాలీపై శునకాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన బాలురపై ప్రశంసల వర్షం
  • ఆర్థిక స్థోమత లేకున్నా.. మూగజీవిపై కరుణ చూపిన చిన్నారులు అంటూ ప్రశంసలు
నోయిడాలో ఇద్దరు చిన్నారులు ప్రదర్శించిన కరుణ పలువురి హృదయాలను కదిలిస్తోంది. గాయపడిన తమ పెంపుడు కుక్క ప్రాణాలను కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, మూగజీవి పట్ల వారు చూపిన ప్రేమకు నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు.

నోయిడాలోని ఆ చిన్నారుల కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కను మరో కుక్క కరవడంతో గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారులు తమ కుక్కను ఒక చిన్న ట్రాలీ వంటి బండిలో మండుటెండలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చిరిగిన దుస్తులు, సాధారణ చెప్పులు ధరించిన ఆ బాలురు, ఒకరు ట్రాలీని లాగుతుండగా, మరొకరు వెనుక నుంచి బండిని ముందుకు నెడుతున్నారు.

ఈ దృశ్యాన్ని ఒక బాటసారి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. పిల్లలు రోడ్డు పక్కన ట్రాలీని కష్టపడి లాక్కుంటూ వెళుతుండగా, ఆ బాటసారి వారిని ఆపి విషయం తెలుసుకున్నారు. అప్పటికే ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించామని, తదుపరి చికిత్స కోసం మళ్లీ వెళుతున్నామని పసుపు రంగు టీషర్ట్ ధరించిన బాలుడు వివరించాడు. ఆ చిన్నారుల దయార్ద్ర హృదయానికి ముగ్ధుడైన బాటసారి వారిని మెచ్చుకుంటూ, బాలుడి వీపు తట్టి ధైర్యం చెప్పాడు.

ఈ వీడియోను 'స్ట్రీట్ డాగ్స్ ఆఫ్ బాంబే' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పంచుకుంటూ, "ఈ చిన్నారుల వద్ద డబ్బు లేదు, వనరులు లేవు. కానీ తమ కుక్కపై అపారమైన ప్రేమ, కరుణ నిండిన హృదయం ఉన్నాయి. చాలా మంది పెద్దలు కూడా చేయని పని వీరు చేశారు. వీరే అసలైన హీరోలు. ఇలాంటి దయ, ధైర్యం, సానుభూతి నిండిన పిల్లలను తయారు చేద్దాం" అని రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆ చిన్నారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Noida children
Viral Video
Dog injured
Animal love
Kindness
Compassion

More Telugu News