Nara Lokesh: ప్ర‌ధాని మోదీ నుంచి స‌ల‌హాలు తీసుకున్నా: మంత్రి లోకేశ్‌

Andhra Minister Lokeshs Family Meets PM Modi in Delhi
  • నిన్న కుటుంబ‌స‌మేతంగా ప్ర‌ధానిని క‌లిసిన మంత్రి లోకేశ్
  • ఈ సందర్భంగా ‘యువగళం’ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
  • ఈ భేటీ అనంత‌రం 'ఎక్స్' వేదిక‌గా లోకేశ్ పోస్ట్
ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన విష‌యం తెలిసిందే. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో ఢిల్లీ రావాలని మంత్రి లోకేశ్‌ను ఆహ్వానించిన సందర్భంగా ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ‘యువగళం’ కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు ముందు లోకేశ్ చేపట్టిన 3,132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్‌లో పొందుపరిచారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని దానిపై సంతకం చేసి లోకేశ్‌కు అంద‌జేశారు. ఇక‌, ఈ భేటీలో ప్రధాని మోదీ, లోకేశ్ దంపతుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుమారుడు దేవాన్ష్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని స‌ర‌దాగా ముచ్చటించారు. 

మోదీతో భేటీపై లోకేశ్ ట్వీట్‌
ప్ర‌ధాని మోదీతో భేటీ అనంత‌రం మంత్రి లోకేశ్ 'ఎక్స్'  వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్ర‌ధానిని క‌లిసే అవ‌కాశం రావ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. "ఈరోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీని న్యూఢిల్లీలోని ఆయ‌న నివాసంలో కుటుంబసమేతంగా కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఏపీ పురోగతికి ప్రధానమంత్రి అందించిన మద్దతుకు కృతజ్ఞతలు. జాతీయ భద్రత, దేశాభివృద్ధిలో ప్రధాని నిర్ణయాత్మక నాయకత్వానికి ధ‌న్య‌వాదాలు. 2047  వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడంలో రాష్ట్రం దేశానికి ఏ విధంగా తోడ్ప‌డాలో ప్రధాని నుంచి స‌ల‌హాలు తీసుకున్నా" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. 
Nara Lokesh
PM Modi
Narendra Modi
Andhra Pradesh
AP Politics
Yuva Galam
Coffee Table Book
Delhi Meeting
India Politics

More Telugu News