KKR: డిఫెండింగ్ ఛాంపియ‌న్‌కు నిరాశే.. ప్లేఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ నిష్క్ర‌మ‌ణ‌!

KKR Eliminated From IPL 2025 Playoffs Race
  • ఐపీఎల్ రీస్టార్ట్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం
  • త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో కోల్‌క‌తాకు నిరాశ‌
  • ఆర్‌సీబీ, కేకేఆర్‌కు చెరో పాయింట్‌
  • ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన నాలుగో జ‌ట్టుగా కేకేఆర్‌
  • ఇప్ప‌టికే ఇంటిముఖం ప‌ట్టిన సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్, ఆర్ఆర్‌
ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(కేకేఆర్‌)కు నిరాశే ఎదురైంది. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం కావ‌డంతో కోల్‌క‌తా ప్లేఆఫ్స్ బ‌రి నుంచి నిష్క్ర‌మించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ)తో జరగాల్సిన‌ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 

అయితే, ప్లేఆఫ్ రేసులో నిల‌వాలంటే అజింక్య రహానే నేతృత్వంలోని కేకేఆర్‌ జట్టు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. కానీ, వ‌రుణుడు క‌రుణించ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. రెండు జట్లు చెరొక పాయింట్ పంచుకున్నాయి. ఫలితంగా కోల్‌క‌తాకు 13 మ్యాచుల్లో 5 విజ‌యాలతో 12 పాయింట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. రెండు మ్యాచ్‌లు వ‌ర్షార్ప‌ణం కావ‌డం గ‌మ‌నార్హం. 

కేకేఆర్ లీగ్ స్టేజీలో ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అందులో విజ‌యం సాధించినా ఆ జ‌ట్టు ఖాతాలో కేవ‌లం 14 పాయింట్లు మాత్ర‌మే ఉంటాయి. ఇది ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి వారికి సరిపోదు. దీంతో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ కేకేఆర్ లీగ్ ద‌శ‌లోనే ఇంటిముఖం ప‌ట్టింది. 

మరోవైపు 12 మ్యాచ్‌లలో 17 పాయింట్లతో ఆర్‌సీబీ పాయింట్ల‌ పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. త‌ద్వారా దాదాపు ప్లేఆఫ్ స్థానాన్ని ఖ‌రారు చేసుకుంది. ఇక‌, ఇటీవ‌ల భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా తొమ్మిది రోజుల పాటు నిలిచిపోయిన ఐపీఎల్‌ 2025 పునఃప్రారంభంలో తొలి మ్యాచ్ ఇది. కానీ, వర్షం కార‌ణంగా అభిమానులు తీవ్రంగా నిరాశ‌చెందారు. 

కాగా, ఇప్ప‌టికే గ‌త సీజ‌న్ ఫైన‌లిస్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌), ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియ‌న్ అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే), రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌) కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కేకేఆర్ కూడా ఈ జాబితాలో చేరింది. 
KKR
IPL 2025
Kolkata Knight Riders
Playoffs
Rain
Match Abandoned
Ajinkya Rahane
RCB
Royal Challengers Bangalore
IPL

More Telugu News