Ponguleti Srinivas Reddy: తెలంగాణలో మళ్లీ వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థ

Telangana to Restore VRO VRA System
  • దొరకు ఏమి ఆలోచన వచ్చిందో ఏమో రాత్రికి రాత్రికి విఆర్వో , విఆర్ఏ వ్యవస్థలను రద్దు చేశారన్న మంత్రి పొంగులేటి
  • విఆర్వో, విఆర్ఏ వ్యవస్థలను పునరుద్దరిస్తామని వెల్లడి
  • ధరణి పోర్టల్ వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్న మంత్రి 
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం మాట్లాడుతూ, దొర (కేసీఆర్)కు ఏమి ఆలోచన వచ్చిందో తెలియదు కానీ రాత్రికి రాత్రి వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేశారని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. జూన్ 2 నాటికి ప్రభుత్వం ద్వారా లైసెన్సులు ఇచ్చి ఆరు వేల మంది సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు.

నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కూర్చొని వారి స్వార్థం కోసం ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారని, కేసీఆర్ పాలనను ఉద్దేశించి ఆయన విమర్శించారు. ధరణి వల్ల సామాన్య రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందుకే ఆ దొరలను ఫామ్ హౌస్‌కు పరిమితం చేశారని అన్నారు. ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని గత బీఆర్ఎస్ నాయకులు సంపాదించిన భూముల వివరాలు త్వరలో బయటపడతాయని ఆయన అన్నారు.

భూ భారతికి భయపడి దోపిడీదారులు పారిపోయారని, అందుకే రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా మందగించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా నిలబెట్టేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న తప్పు కూడా జరగకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి కోరారు. 
Ponguleti Srinivas Reddy
VRO
VRA
Telangana Revenue System
Dhharani Portal
Land Records
Surveyors
KCR
Real Estate Telangana
Telangana Politics

More Telugu News