Rachakonda Police: రోడ్ హిప్నాసిస్ పై అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీస్ వీడియో ట్వీట్

Rachakonda Polices Tweet on Road Hypnosis Awareness
  • కనిపించని ప్రమాదం మిమ్మల్ని వెంటాడుతుంటుందని డ్రైవర్లకు హెచ్చరిక
  • సుదీర్ఘ ప్రయాణంలో రెండున్నర గంటల డ్రైవింగ్ తర్వాత రోడ్ హిప్నాసిస్ ముప్పు
  • కళ్లు తెరిచే ఉంటాయి కానీ మెదడు స్పందించదు.. ఫలితమే యాక్సిడెంట్ అని వెల్లడి
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాల్లో అతివేగం, వాహన కండీషన్, డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు మరో కనిపించని ముప్పు కూడా ఉందని రాచకొండ పోలీసులు చెబుతున్నారు. అదే రోడ్ హిప్నాసిస్.. సుదీర్ఘ ప్రయాణంలో వాహనంతో రోడ్డు పైకెక్కిన రెండున్నర గంటల తర్వాత ఇది మొదలవుతుందని చెప్పారు. కళ్లు తెరిచే ఉంటాయి కానీ మెదడు స్పందించదని, ఫలితంగా ప్రమాదానికి గురవుతారని హెచ్చరించారు. రోడ్ హిప్నాసిస్ కు గురైన డ్రైవర్ కు ప్రమాదం జరిగిన సమయంలో ఏంజరిగిందనే విషయమే గుర్తుండదని చెప్పారు.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ప్రమాదం జరగడానికి 15 నిమిషాల ముందు నుంచి ఏం జరిగిందనేది ఏమీ గుర్తుండదని నిపుణులు చెబుతున్నారని అన్నారు. డ్రైవర్ తను నడుపుతున్న వాహనం వేగం, తన ముందున్న వాహనం వేగాన్ని సరిగ్గా అంచనా వేయలేడని తెలిపారు. రాత్రి వేళ ప్రయాణించేటపుడు రోడ్ హిప్నాసిస్ కు గురయ్యే ముప్పు ఎక్కువ అని, తోటి ప్రయాణికులు నిద్ర పోతుంటే ముప్పు మరింత ఎక్కువని చెప్పారు. రోడ్ హిప్నాసిస్ ముప్పును తప్పించుకోవడానికి ప్రతీ రెండు గంటలకు వాహనాన్ని ఆపి ఐదారు నిమిషాల పాటు నడవాలని సూచించారు.
Rachakonda Police
Road Hypnosis
Driving Safety
Highway Accidents
Traffic Safety
Drowsiness While Driving
Driving Tips
Telangana Police
Road Safety Awareness

More Telugu News