Indian Army: ‘ఆపరేషన్ సిందూర్’పై సరికొత్త వీడియోను రిలీజ్ చేసిన సైన్యం.. వీడియో ఇదిగో!

Indian Army Releases New Video on Operation Sindhu
  • సోషల్ మీడియాలో పశ్చిమ కమాండ్ వీడియో పోస్ట్
  •  పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యే ఈ ఆపరేషన్
  • మే 7న పాక్, పీవోకేలలో 9 ఉగ్ర స్థావరాలపై దాడి
  •  పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పాం: భారత సైన్యం
పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పేందుకే ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టామని భారత సైన్యం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓ కొత్త వీడియోను ఆదివారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో విడుదల చేసింది. ‘పక్కా ప్రణాళికతో, తగిన శిక్షణతో దీనిని అమలు చేశాం. న్యాయం జరిగింది’ అని భారత సైన్యానికి చెందిన పశ్చిమ కమాండ్ ఈ వీడియోలో పేర్కొంది. భారత సైన్యం పశ్చిమ కమాండ్ విడుదల చేసిన ఈ వీడియోలో ఒక సైనికాధికారి మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్’ అనేది పాకిస్థాన్‌కు ఒక గుణపాఠం. దశాబ్దాలుగా వారు నేర్చుకోని పాఠం ఇది’ అని వ్యాఖ్యానించారు.

‘పహల్గామ్ ఉగ్రదాడితో ఇదంతా మొదలైంది. ఆ ఘటనతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈసారి వారి తరతరాలు గుర్తుంచుకునేలా గుణపాఠం చెప్పాలన్నదే మా ఏకైక ఆలోచన. ఇది ప్రతీకారం కాదు, న్యాయం మాత్రమే. మే 9వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ప్రతీ శత్రు సైనిక స్థావరాన్ని భారత సైన్యం ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక చర్య మాత్రమే కాదు, పాకిస్థాన్‌కు దశాబ్దాలుగా అర్థం కాని రీతిలో చెప్పిన గుణపాఠం’ అని సైనిక సిబ్బంది ఆ వీడియోలో వివరించారు.

గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతిస్పందనగా, మే 7న భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద సంబంధిత స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా తమ చర్య ఎంత కఠినంగా ఉంటుందో పాకిస్థాన్‌కు మరోసారి స్పష్టం చేసినట్టయింది.
Indian Army
Operation Sindhu
Pakistan
Surgical Strike
Jammu and Kashmir
Terrorism
Counter-terrorism
Military Operation
India-Pakistan conflict
Pahalgham attack

More Telugu News