Israel: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ నిప్పుల వర్షం... 66 మంది మృతి

Israels Airstrikes on Gaza Kill 66
  • గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు
  • శనివారం రాత్రి దాడుల్లో 66 మంది పాలస్తీనియన్ల మృతి
  • మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఒకే కుటుంబానికి చెందిన 9 మంది
  • ఖాన్ యూనిస్, ఉత్తర గాజా, జబాలియా శరణార్థి శిబిరాలపై దాడులు
  • హమాస్ కాల్పుల విరమణను తిరస్కరించడం వల్లే దాడులన్న నెతన్యాహు
గాజాలో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దళాలు గాజాలోని పలు ప్రాంతాలపై శనివారం అర్థరాత్రి భీకర వైమానిక దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడుల్లో నిరాశ్రయులు తలదాచుకుంటున్న నివాసాలు, శిబిరాలు లక్ష్యంగా మారడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. మొత్తం 66 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన వివరాల ప్రకారం, ఖాన్ యూనిస్‌లో 20 మంది, ఉత్తర గాజాలో 36 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా, ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఈ దాడుల్లో దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

శనివారం ఒక్కరోజే మొత్తం 150 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని, మరో 450 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనప్పటి నుంచి ఇప్పటివరకు మూడు వేల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు పేర్కొంది.

ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు హమాస్ నిరాకరించడం వల్లే దాడులను తీవ్రతరం చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 
Israel
Gaza
Benjamin Netanyahu
Palestinian deaths
Air strikes
Hamas
Khan Yunis
Northern Gaza
Jabalia refugee camp
Israel-Palestine conflict

More Telugu News