KCR: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి

KCR Expresses Grief Over Gulzar House Fire Tragedy
  • చార్మినార్ వద్ద గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్నిప్రమాదం
  • ఘటనలో 17 మంది మృతి
  • మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి కేసీఆర్ సూచన
  • బాధితులకు పార్టీ అండగా ఉంటుందన్న కేటీఆర్
  • మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్న హరీశ్ రావు
హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్‌ దగ్గర గుల్జార్‌హౌస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు.

ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలు కాపాడాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ అగ్నిప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు తమ పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికే తమ పార్టీ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతోందని కేటీఆర్ తెలిపారు.

గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
KCR
Gulzar House Fire
Hyderabad Fire
Charminar Fire
Telangana Fire
KTR
Harish Rao
BRS
Tragedy
Fire Accident

More Telugu News