Harish Rao: తెలంగాణను ఈ విధంగా నెంబర్ వన్ చేయాలని చూస్తున్నారా?: హరీశ్ రావు

Harish Rao Slams Telangana Congress Govt Over Liquor Policy
  • బీర్లు, బార్లను నమ్ముకొని కాంగ్రెస్ పాలన: హరీశ్
  • ఎక్సైజ్ ఆదాయంలో 'తెలంగాణ రైజింగ్' ఇదేనా అని నిలదీత
  • మద్యం ధరలు పెంచి ఖజానా నింపుకోవడమేనా మార్పు? అంటూ ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యం ధరలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. బీర్లను, బార్లను నమ్ముకుని, మద్యం అమ్మకాల ద్వారా ఖజానా నింపుకోవడమే 'మార్పు' అని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలి, కేవలం ఎక్సైజ్ ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి సారించిందని, "ఎక్సైజ్ ఆదాయంలో 'తెలంగాణ రైజింగ్' అంటే ఇదేనా?" అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను అటకెక్కించి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. "గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై మద్యం విషయంలో నానా రాద్ధాంతం చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అధికారంలోకి రాగానే బీర్ల ధరలు 15% పెంచారు. త్వరలో మద్యం ధరలు కూడా పెంచి, పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరవడానికి సిద్ధమయ్యారు. ఇదేనా మీరు తెస్తామన్న మార్పు?" అని హరీశ్ రావు నిలదీశారు.

ఎన్నికల మేనిఫెస్టో 'అభయహస్తం'లో ఎక్సైజ్‌ విధానాన్ని పునఃసమీక్షించి, సవరణలు చేస్తామని, బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను ఆయన గుర్తుచేశారు. "ఎక్సైజ్ విధానాన్ని సమీక్షించడం అంటే ధరలు ఇష్టానుసారం పెంచడమేనా ముఖ్యమంత్రి గారూ? బెల్ట్ షాపులు రద్దు చేయకపోగా, కొత్తగా మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు తెరలేపడం దేనికి సంకేతం?" అని ప్రశ్నించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవాస్తవాలు ప్రచారం చేసి, ఇప్పుడు ఆ లోటును మద్యం ద్వారా పూడ్చుకోవాలని చూడటం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రాన్ని 'తాగుబోతుల తెలంగాణ'గా మార్చి, మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణను నంబర్ వన్ చేయాలని చూస్తున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 100కు పైగా మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారన్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది యువత భవిష్యత్తును నాశనం చేయడమేనని, ఇంతకంటే దిగజారుడు పాలన ఉండదని అన్నారు.


Harish Rao
Telangana Congress
Liquor Prices
Excise Revenue
Telangana Politics
Micro Breweries
Belt Shops
TRS
BRS
Telangana Economy

More Telugu News