Telangana Medical Council: కాంపౌండర్లే వైద్యులు... వేటు వేసిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్

Telangana Medical Council Cracks Down on Fake Doctors
  • నల్లగొండ జిల్లాలో నకిలీ వైద్యుడి వైద్యం వికటించి మహిళ మృతి
  • బాధిత కుటుంబంతో రాజీ చేసుకున్న ఆసుపత్రి యాజమాన్యం
  • నకిలీ వైద్యులపై చర్యలు చేపట్టిన మెడికల్ కౌన్సిల్
  • నల్లగొండ జిల్లాలో 14 హెల్త్ సెంటర్లపై కేసులు నమోదు 
తెలంగాణలోని పలు నగరాలు, పట్టణాల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ తరహా వైద్యులు పుట్టుకొస్తున్నారు. అర్హత లేకున్నా నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతూ ఆసుపత్రులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు ఆసుపత్రుల్లో కొంతకాలం సహాయకులుగా పనిచేసి, ఆ తరువాత వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. ఎలాంటి అర్హత లేకుండానే రోగులకు యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ వంటి మందులు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే అర్హత లేని వైద్యుడు, అనుమతులు లేని ఆసుపత్రిలో ఓ మహిళకు శస్త్రచికిత్స చేయగా, వైద్యం వికటించి ఆమె మృతి చెందిన ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చోటుచేసుకుంది. ఈ విషయం వెలుగులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతుందని భావించిన ఆసుపత్రి యాజమాన్యం, బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృతురాలి పిల్లల పేరున కొంత డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

పోయిన ప్రాణం తిరిగి రాదు కదా అంటూ వారికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఆ మహిళను కాపాడేందుకు రూ.20 లక్షలు ఖర్చు చేయడంతో పాటు పిల్లలకు కొంత మొత్తం ఇస్తుండటంతో వారు అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ విషయం క్రమంగా బయటకు పొక్కి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం బహిర్గతమైంది.

దీంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నకిలీ వైద్యులపై కొరఢా ఝుళిపించింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 14 ఆరోగ్య కేంద్రాలపై అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. నకిలీ ఆసుపత్రులు, వైద్యులపై మెడికల్ కౌన్సిల్ సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైద్యులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ వెల్లడించారు. 
Telangana Medical Council
Fake Doctors
Quack Doctors
Unauthorized Hospitals
Medical Malpractice
Suryapeta
Nalgonda
Antibiotics
Steroids
Medical Negligence

More Telugu News