Kandal Durga Prasad: ఏపీలో త్వరలోనే నంది అవార్డులు

AP Minister Announces Nandi Awards Return
  • నవంబర్‌లో నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రధానం: మంత్రి కందుల దుర్గేశ్
  • త్వరలో ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
  • భవిష్యత్తులో అమరావతిలో సినిమా రంగం ఎదిగేందుకు కృషి చేస్తామని వెల్లడి 
ఈ ఏడాది నవంబర్‌లో నంది నాటకోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. నిన్న అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏలూరులోని శ్రీ మోతే గంగరాజు ప్రాంగణంలోని వైఎంహెచ్‌ఏ హాల్‌లో జరిగిన అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శతజయంతి ఉత్సవాల్లో, జాతీయ స్థాయి తెలుగు నాటక పోటీలో మంత్రి కందుల దుర్గేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళా, సాంస్కృతిక రంగాల వైభవాన్ని, కూటమి ప్రభుత్వం కళలకు, సాంస్కృతిక రంగానికి అందిస్తున్న చేయూతను, పర్యాటక, సినీ రంగ అభివృద్ధి విశేషాలను, పద్య నాటకం గత ఐదేళ్లలో నాటక, కళా రంగాలకు ఇవ్వని పురస్కారాలను తాము అధికారంలోకి రాగానే అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉగాది, కందుకూరి పురస్కారాలు అందించామని గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఘనత తెచ్చిన నంది నాటకోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. టీవీ, సినిమా రంగానికి ఇచ్చే నంది అవార్డులను పునరుద్ధరించి నంది నాటకోత్సవాలతో పాటు కలిపి నవంబర్‌లో అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారుల కోసం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఇవ్వాలని ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి కోరినట్లు ఆయన వెల్లడించారు.

కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు అవకాశం ఉందని ఆయన అన్నారు. పీపీపీ విధానంలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో అమరావతిలో సినిమా రంగం ఎదిగేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. 
Kandal Durga Prasad
Nandi Awards
Andhra Pradesh
AP Minister
Telugu Cinema
Telugu Theatre
National School of Drama
Rajamahendravaram
Tourism
Arts and Culture

More Telugu News