Abu Saifullah Khalid: పాక్‌లో హతమైన సైఫుల్లా ఖలీద్ ఎవరు?.. ఎందుకు చంపేశారు?

Death of Abu Saifullah Khalid A Major Blow to Lashkar e Taiba
  •  ఉగ్రవాద సంస్థ లష్కరేలో ఖలీద్ కీలక పాత్ర
  •  సింధ్ ప్రావిన్స్‌లో ఇంటి బయట దుండగుల కాల్పులు
  •  2006 ఆర్‌ఎస్‌ఎస్ హెడ్‌క్వార్టర్స్ దాడిలో ప్రధాన సూత్రధారి
  •  సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై దాడి సహా అనేక ఉగ్ర కుట్రల్లో ప్రమేయం
  •  నేపాల్ నుంచి భారత్‌ వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణ
  •  ఇటీవల సింధ్‌లో నియామకాలు, నిధుల సేకరణలో క్రియాశీలం 
భారత్‌లో అనేక ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కీలక ఉగ్రవాది అబు సైఫుల్లా ఖలీద్ పాకిస్థాన్‌లో హతమయ్యాడు. సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో ఆదివారం అతని నివాసం వద్ద గుర్తుతెలియని ముగ్గురు దుండగులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. రజావుల్లా నిజామాని ఖలీద్, వినోద్ కుమార్, మహమ్మద్ సలీం వంటి పలు మారుపేర్లతో ఖలీద్ భారత్‌‌ లక్ష్యంగా అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.

2006లో నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడికి ఖలీద్ ప్రధాన సూత్రధారి. ఆ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే, 2005లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)పై జరిగిన దాడిలోనూ ఇతడి ప్రమేయం ఉంది. ఆ దాడిలో ప్రొఫెసర్ మునీష్ చంద్ర పూరి మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఆ ఘటనలో నిందితులు తప్పించుకోగా, ఖలీద్ సన్నిహితుడైన అబు అనాస్‌పై ఛార్జిషీట్ దాఖలైనా అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు.

ఇంతేకాకుండా, 2008లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడి వెనుక కూడా ఖలీద్ ఉన్నాడు. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలోనూ దాడి చేసినవారు పట్టుబడలేదు.

 నేపాల్ నుంచి పాకిస్థాన్ వరకు కార్యకలాపాలు 
2000వ దశకం మధ్యకాలం నుంచి ఖలీద్ నేపాల్ కేంద్రంగా లష్కరే కార్యకలాపాలను నడిపించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఉగ్రవాదుల నియామకాలు, ఆర్థిక వ్యవహారాలు, లాజిస్టిక్స్, ఇండో-నేపాల్ సరిహద్దు ద్వారా ఉగ్రవాదుల తరలింపు వంటి కార్యకలాపాలను పర్యవేక్షించాడు. లష్కరే తోయిబాకు చెందిన అజమ్ చీమా అలియాస్ బాబాజీ, సంస్థ చీఫ్ అకౌంటెంట్ యాకూబ్ వంటి కీలక వ్యక్తులతో ఖలీద్ సన్నిహితంగా పనిచేసినట్టు సమాచారం.

భారతీయ ఏజెన్సీలు నేపాల్‌లోని లష్కరే నెట్‌వర్క్‌ను ఛేదించడంతో ఖలీద్ పాకిస్థాన్‌కు మకాం మార్చాడు. అక్కడి నుంచి కూడా లష్కరే తోయిబా, జమాత్-ఉద్-దావా (జేయూడీ) అగ్ర నాయకులైన యూసుఫ్ ముజమ్మిల్ (లష్కరే జమ్మూకశ్మీర్ కమాండర్), ముజమ్మిల్ ఇక్బాల్ హష్మీ, ముహమ్మద్ యూసుఫ్ తైబీలతో సమన్వయం చేసుకుంటూ తన కార్యకలాపాలు కొనసాగించాడు.

 అంతర్గత కలహాలే హత్యకు కారణమా?
ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని బాదిన్, హైదరాబాద్ జిల్లాల్లో లష్కరే తోయిబా కోసం నియామకాలు చేపట్టడం, నిధులు సేకరించడం వంటి బాధ్యతలను ఖలీద్‌కు అప్పగించినట్టు తెలిసింది. అతను తన నేపాలీ భార్య నగ్మాబానుతో కలిసి బాదిన్‌లో నివసిస్తున్నట్టు సమాచారం. భద్రతా సంస్థల కథనం ప్రకారం ఖలీద్ కదలికలను పరిమితం చేసుకోవాలని అతనికి వ్యక్తిగత భద్రత కూడా కల్పించాలని అతని హ్యాండ్లర్లు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ, ఆదివారం మధ్యాహ్నం దుండగులు కాపుకాసి అతన్ని కాల్చి చంపారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల అంతర్గత కలహాలు లేదా ఇతర శక్తుల ప్రమేయంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
Abu Saifullah Khalid
Lashkar-e-Taiba
Pakistan
Terrorist
India
Nagpur RSS attack
Bangalore IISc attack
Rampur CRPF attack
Nepal
Jammat-ud-Dawah

More Telugu News