Nandigam Suresh: నందిగం సురేశ్ అరెస్ట్ పై తుళ్లూరు డీఎస్పీ ఏం చెప్పారంటే..!

Nandigam Suresh Arrested Tulluru DSPs Statement
  • రాజు అనే వ్యక్తిని చితకబాదిన నందిగం సురేశ్
  • రాజును చంపేయాలని సురేశ్ కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారన్న డీఎస్పీ
  • సురేశ్ పై ఇప్పటికే ఒక హత్య కేసు ఉందని వెల్లడి
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒక వ్యక్తిపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఉద్దండరాయునిపాలెం గ్రామంలోని బొడ్డురాయి సెంటర్ వద్ద రాజు అనే వ్యక్తి నిలబడి ఉండగా... నందిగం సురేశ్, ఆయన సోదరుడు, మరో ఇద్దరు వ్యక్తులు కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. అనంతరం, సురేశ్, ఆయన సోదరులు రాజును తీవ్రంగా కొట్టి, బలవంతంగా బైక్‌పై తమ ఇంటికి తీసుకెళ్లారని డీఎస్పీ వివరించారు.

ఇంటివద్ద కూడా రాజును కిందపడేసి కాళ్లతో విచక్షణారహితంగా తన్నారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు డీఎస్పీ తెలిపారు. "రాజును చంపి కృష్ణా నదిలో పడేద్దాం" అని నందిగం సురేశ్ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటుండగా విని, భయంతో వారి నుంచి రాజు తప్పించుకున్నాడని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం బాధితుడు రాజు తన బంధువులు, కుటుంబ సభ్యుల సహాయంతో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నందిగం సురేశ్ పై గతంలోనే 12 కేసులు నమోదై ఉన్నాయని, వాటిలో ఒక హత్య కేసు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. అన్ని కేసుల్లోనూ సురేశ్ ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్నారని డీఎస్పీ చెప్పారు. "షరతులతో కూడిన బెయిల్‌పై ఉండి కూడా ఒక వ్యక్తిని చంపుతానని బెదిరించడం తీవ్రమైన నేరం కావడంతో తక్షణమే చర్యలు తీసుకున్నాం" అని డీఎస్పీ స్పష్టం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి నందిగం సురేశ్ పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 140(1), 127(2), 109(1), 351(2), R/W 3(5) కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. ఈ కేసులో ప్రమేయమున్న మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. నందిగం సురేశ్ పై చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Nandigam Suresh
Arrest
Tulluru DSP
Murder Attempt
YCP Leader
Former MP
Andhra Pradesh
Crime News
Indian Penal Code
Attack

More Telugu News