Maria Jose Estupinan Sanchez: డెలివరీ బాయ్ వేషంలో వచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్‌ కాల్చివేత!

Influencer Shot Dead by Delivery Boy in Colombia
  • కొలంబియాలో 22 ఏళ్ల యువతి దారుణ హత్య
  • మాజీ ప్రియుడిపై గృహహింస కేసు గెలిచిన మరుసటి రోజే ఘటన
  • మాజీ ప్రియుడిపైనే పోలీసుల ప్రధాన అనుమానం
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు
 డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఒకరు 22 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఆమె ఇంటి బయటే కాల్చి చంపాడు. కొలంబియాలోని కుకుటా నగరంలో లా రివియేరా ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో జరిగిందీ ఘటన. డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన వ్యక్తి 22 ఏళ్ల మరియా జోస్ ఎస్తుపినాన్ సాంచెజ్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. దుండగుడు కాల్పులు జరిపిన వెంటనే సాంచెజ్ సహాయం కోసం గట్టిగా కేకలు వేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. కాల్పులు జరిపిన తర్వాత సాంచెజ్ ఇంటి నుంచి నిందితుడు వేగంగా పారిపోతున్నట్టు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ‘ఒక వ్యక్తి ప్యాకేజీ డెలివరీ చేస్తున్నట్టు నమ్మించి ఆమెను హత్య చేశాడు’ అని పోలీసులు తెలిపారు.

 మాజీ ప్రియుడిపై అనుమానాలు
ఈ దాడి జరగడానికి ఒక రోజు ముందే సాంచెజ్ తన మాజీ ప్రియుడిపై పెట్టిన గృహహింస కేసులో విజయం సాధించినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ కేసులో భాగంగా ఆమెకు 30 మిలియన్ కొలంబియన్ పెసోలు (సుమారు 7,000 అమెరికన్ డాలర్లు) పరిహారంగా లభించాయి. కోర్టులో కేసు గెలవడమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని, దీని వెనుక మాజీ ప్రియుడి హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేసినట్లు అధికారికంగా ప్రకటించలేదు. నల్ల టోపీ, జాకెట్, జీన్స్ ధరించి, వీపున బ్యాగ్ తగిలించుకున్న ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 ఇలాంటిదే మరో ఘటన
కొద్ది రోజుల క్రితం మెక్సికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ వలేరియా మార్క్వెజ్ కూడా లైవ్ స్ట్రీమ్‌లో ఉండగా ఇదే తరహాలో హత్యకు గురవడం గమనార్హం. ఆమెను కూడా డెలివరీ బాయ్ వేషంలో వచ్చిన వ్యక్తే లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ హత్యను 'ఫెమిసైడ్' (మహిళల హత్య)గా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. 
Maria Jose Estupinan Sanchez
Colombia Influencer Murder
Cucuta
Delivery Boy
Femicide
Social Media Influencer
Ex-boyfriend
Domestic Violence
CCTV Footage
Colombian Peso

More Telugu News