Bhanu Prakash Reddy: తిరుమలలో మరో స్కామ్... తులాభారం కానుకలను దొంగిలించారు: భానుప్రకాశ్ రెడ్డి

Bhanu Prakash Reddy Alleges TTD Scam Tulabharam Offerings Stolen
  • జగన్ హయాంలో టీటీడీలో భారీ అక్రమాలు జరిగాయన్న భానుప్రకాశ్ రెడ్డి
  • 2019-24 మధ్య జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్
  • శ్రీవారి ఆభరణాలను కూడా దొంగిలించారనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్య
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత భానుప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీటీడీని డబ్బు సంపాదించే సంస్థగా మార్చేసి, స్వామివారి ఖజానాకు గత పాలకులు భారీగా నష్టం చేకూర్చారని మండిపడ్డారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించే తులాభారం కానుకల నగదును కూడా కొందరు సిబ్బంది దొంగిలించారని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా తాను విజిలెన్స్ ఎస్పీకి అందజేశానని చెప్పారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కూడా కోరినట్లు ఆయన వెల్లడించారు.

గతంలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, విజిలెన్స్ సిబ్బంది పాత్రపైనా విచారణ జరపాలని భానుప్రకాశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. "పరకామణిలో జరిగిన దొంగతనం, కల్తీ నెయ్యి వ్యవహారంతో పాటు తులాభారంలో భక్తులు ఇచ్చిన కానుకలను కూడా దొంగిలించారు. తులాభారంలో జరిగిన అక్రమాలను అప్పటి విజిలెన్స్ అధికారులు గుర్తించినప్పటికీ, నాటి ఉన్నతాధికారులు వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు" అని ఆయన విమర్శించారు. భక్తులు సమర్పించిన కానుకల్లో సగం మాత్రమే లెక్కల్లో చూపించి, మిగిలిన సగాన్ని అక్రమంగా పక్కదారి పట్టించారని ఆరోపించారు.

పరకామణిలో దొంగతనం చేసిన ఉద్యోగి విషయంలో కేవలం మొక్కుబడిగా చెట్టు కింద పంచాయతీ పెట్టి, ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని ఆయన విమర్శించారు. అదేవిధంగా, తులాభారంలో అక్రమాలకు పాల్పడిన వారిపైనా కేసులు నమోదు చేయకుండా వదిలిపెట్టారని చెప్పారు. "ఈ తరహా ఘటనలు చూస్తుంటే, శ్రీవారి అమూల్యమైన ఆభరణాలను కూడా దొంగిలించారేమోనన్న అనుమానం కలుగుతోంది" అని భానుప్రకాశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జరగనున్న టీటీడీ పాలకమండలి సమావేశంలో కూడా ఈ అంశాలను ప్రస్తావించి, చర్చకు పట్టుబడతానని ఆయన స్పష్టం చేశారు.

Bhanu Prakash Reddy
Tirumala Thirupati Devasthanams
TTD Scam
Tulabharam
Offering Theft
Tirumala Temple
Andhra Pradesh Politics
BJP
YCP
Corruption

More Telugu News