Nara Lokesh: విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా... హాజరుకాని నేతలపై లోకేశ్ ఆగ్రహం

Visakhapatnam Deputy Mayor Election Postponed Lokeshs Anger Erupts
  • డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయింపు
  • ఎన్నికకు పూర్తి స్థాయిలో హాజరు కాని టీడీపీ కార్పొరేటర్లు...!
  • చర్యలు తీసుకోవడానికి వెనుకాడవద్దన్న లోకేశ్
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్యంగా వాయిదా పడటం అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్పొరేటర్లు తగినంత సంఖ్యలో హాజరుకాకపోవడమే దీనికి కారణం. ఈ పరిణామంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈరోజు జరగాల్సిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నికకు మొత్తం 74 మంది సభ్యులకు గాను కేవలం 54 మందే హాజరయ్యారు. ఎన్నిక నిర్వహణకు కనీసం 56 మంది సభ్యుల కోరం అవసరం కాగా, ఇద్దరు సభ్యుల కొరత ఏర్పడింది. దీంతో అధికారులు ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కౌన్సిల్ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయినప్పటికీ, పలువురు గైర్హాజరు కావడం గమనార్హం.

ఈ పరిణామాలపై టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా దృష్టి సారించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఈ ఎన్నికకు గైర్హాజరైన కార్పొరేటర్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం. కొందరిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడవద్దని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కీలక సూచనలు చేసినట్లు తెలిసింది.

ఈ పరిణామాలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ... జీవీఎంసీలో తమకు కావాల్సినంత సంఖ్యాబలం ఉందని తెలిపారు. "డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. గత రాత్రి 11 గంటలకు ఆ పదవిని జనసేన పార్టీకి కేటాయించాలని నిర్ణయించాం" అని పల్లా తెలిపారు. టీడీపీలో కూడా ఆ పదవిని ఆశించేవారు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఎన్నిక వాయిదా పడటానికి సమన్వయ లోపం కూడా ఒక కారణమని, అందుకే ఈ ఇబ్బంది తలెత్తిందని ఆయన అంగీకరించారు. జీవీఎంసీ కౌన్సిల్‌కు సభ్యులంతా హాజరవుతారని, దీనికి తాను పూర్తి బాధ్యత వహిస్తానని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

రేపు జరగనున్న ఎన్నికకు సభ్యులందరూ హాజరై, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసేలా చూడాలని పార్టీ శ్రేణులకు అధిష్ఠానం నుంచి గట్టి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం విశాఖ రాజకీయాల్లో కొంత అలజడి సృష్టించింది. 
Nara Lokesh
Visakhapatnam Deputy Mayor Election
TDP
GVMC
Palla Srinivasa Rao
Janasena Party
Andhra Pradesh Politics
Election Postponement
Visakhapatnam Municipal Corporation
Corporators

More Telugu News