Mallu Bhatti Vikramarka: రేవంత్ రెడ్డిని వజ్రంతో పోల్చిన మల్లు భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka Praises Revanth Reddy as Diamond
  • రేవంత్ రెడ్డిపై భట్టి విక్రమార్క ప్రశంసలు
  • రేవంత్ ఆలోచనలు చాలా గొప్పవని కితాబు
  • 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకం ఆయన మనులో నుంచే పుట్టిందన్న డిప్యూటీ సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక వజ్రం లాంటి వారని, ఆయన హృదయంలోంచి వచ్చిన ఆలోచనే 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకమని భట్టి కొనియాడారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్‌ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, "దేశ చరిత్రలోనే ఇదొక గొప్ప కార్యక్రమం. జల్, జంగల్, జమీన్, భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాల నినాదాలను ఈ ప్రభుత్వం చట్టంగా మారుస్తోంది. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వామిని కావడం నా జన్మ ధన్యమైంది" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు చాలా గొప్పవని, వజ్రం లాంటి ఆయన మనసులోంచి ఈ పథకం పుట్టిందని పేర్కొన్నారు. ఒకప్పుడు భూమి కోసం ఈ గడ్డపై ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.

"ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలి. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజన కుటుంబాలు మరింత అభివృద్ధి చెందుతాయి. వారికి కేవలం భూములే కాకుండా, వాటిని సాగు యోగ్యం చేసుకునేందుకు అవసరమైన నిధులను కూడా అందిస్తున్నాం" అని భట్టి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పైసాను ప్రజల కోసమే ఖర్చు చేస్తుందని, నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని భట్టి తెలిపారు. ప్రభుత్వంపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న అనవసర విమర్శలను కుట్రలుగానే పరిగణిస్తామని అన్నారు. "సంపదను సృష్టిస్తాం, సృష్టించిన సంపదను పేదలకు పంచుతాం. ఇదే మా నినాదం" అని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. 
Mallu Bhatti Vikramarka
Revanth Reddy
Indira Soura Giri Jala Vikasam
Telangana government
tribal development
Nallamala declaration
Nagarkurnool
Congress party
Telangana news

More Telugu News