Benjamin Netanyahu: వెనక్కి తగ్గేదేలేదు, గాజాను స్వాధీనం చేసుకుంటాం: నెతన్యాహు

Benjamin Netanyahu vows to seize Gaza control
  • గాజాలో దాడులు మరింత తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్
  • తాజా దాడుల్లో 103 మంది పాలస్తీనియన్ల మృతి
  • ఖాన్‌యూనిస్‌ను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం ఆదేశం
గాజా భూభాగాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. హమాస్‌తో జరుగుతున్న యుద్ధం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో గాజాలో దాడులను మరింత ఉద్ధృతం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. దౌత్యపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని, గాజాలో ఆకలి చావులను నివారించాల్సిన అవసరం ఉందని కూడా తాము గుర్తించామని నెతన్యాహు తెలిపారు.

"మా పోరాటం చాలా తీవ్రంగా సాగుతోంది. మేము పురోగతి సాధిస్తున్నాం. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. విజయం సాధించాలంటే, మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరనే విధంగా వ్యవహరించాలి" అని నెతన్యాహు టెలిగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు హమాస్ అంగీకరించకపోవడం వల్లే దాడులను తీవ్రతరం చేశామని నెతన్యాహు గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి సమయంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న నివాసాలు, శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఖాన్‌యూనిస్‌లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26 మంది మరణించారని, మొత్తం మృతుల సంఖ్య 103కు చేరిందని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఇదిలా ఉండగా, గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్‌యూనిస్‌తో పాటు సమీప ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని స్థానిక ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. ఈ ప్రాంతాలను ప్రమాదకరమైన పోరాట క్షేత్రాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.
Benjamin Netanyahu
Gaza
Israel
Hamas
Khan Yunis
Gaza Strip
Israel-Palestine conflict

More Telugu News