Shilpa Shirodkar: మహేశ్ బాబు వదినకు కరోనా పాజిటివ్

COVID Scare in Mahesh Babus Family Shilpa Shirodkar Tests Positive
  • నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్
  • దుబాయ్ లో ఉంటున్న శిల్పా శిరోద్కర్
  • ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఆయన అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ సోదరి, ఒకప్పటి ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న ఆమె, తనకు వైరస్ సోకినట్లు అభిమానులకు తెలియజేస్తూ, అందరూ సురక్షితంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి ఆసియా దేశాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సింగపూర్‌లో రోజువారీ కేసుల సంఖ్య రెండు వేలు దాటుతుండగా, హాంకాంగ్‌లో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయని సమాచారం. చైనాలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దుబాయ్‌లో ఉంటున్న శిల్పా శిరోద్కర్‌కు కోవిడ్ సోకడం సినీ వర్గాల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది.

శిల్పా శిరోద్కర్ 90వ దశకంలో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు. పలు విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు. కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన ఆమె, ఇటీవలే హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 18వ సీజన్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ షో అనంతరం పలు వాణిజ్య ప్రకటనలు, ఫొటోషూట్‌లు, వెబ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు కోవిడ్ సోకినట్లు భావిస్తున్నారు.

Shilpa Shirodkar
Mahesh Babu
Namrata Shirodkar
Bollywood
COVID-19
Dubai
Coronavirus
Tollywood
Bigg Boss 18

More Telugu News