Joe Biden: క్యాన్సర్ అని తేలిన తర్వాత తొలిసారిగా స్పందించిన జో బైడెన్

Joe Biden Responds After Cancer Diagnosis
  • మాజీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్
  • వ్యాధి తీవ్రస్థాయిలో ఉందని, ఎముకలకు పాకిందని ప్రకటన
  • ప్రజల ప్రేమాభిమానాలకు బైడెన్ కృతజ్ఞతలు
మాజీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (82) తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యాధి ఎముకలకు కూడా వ్యాపించిందని (మెటాస్టాసిస్) వైద్యులు నిర్ధారించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన చికిత్సా విధానాలను సమీక్షిస్తున్నట్లు సమాచారం. మూత్ర సంబంధిత లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా, ప్రోస్టేట్‌ గ్రంథిలో కణితి ఉన్నట్లు బయటపడిందని తెలిసింది.

తనకు క్యాన్సర్ సోకిందన్న వార్త వెలువడిన తర్వాత జో బైడెన్ తొలిసారిగా స్పందించారు. అందరూ తన పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తన భార్య జిల్ బైడెన్‌తో ఉన్న ఒక ఫోటోను పంచుకుంటూ, "క్యాన్సర్ మనందరినీ ఏదో ఒక రూపంలో తాకుతుంది. మీలో చాలా మందిలాగే, నేను, జిల్ కష్ట సమయాల్లోనే మరింత దృఢంగా ఉంటామని తెలుసుకున్నాం. మీ ప్రేమ, మద్దతుతో మాకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు" అని బైడెన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

గ్లీసన్ స్కోర్ 9.. వైద్యులు ఏమంటున్నారు?

జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్‌కు వైద్యులు గ్లీసన్ స్కోర్ 9గా నిర్ధారించారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవడానికి వైద్యులు ఈ గ్లీసన్ స్కోరింగ్ విధానాన్ని ఉపయోగిస్తారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, గ్లీసన్ స్కోర్ 6 ఉంటే తక్కువ స్థాయి క్యాన్సర్‌గా, 7 ఉంటే మధ్యస్థంగా, 8 నుంచి 10 వరకు ఉంటే తీవ్రమైన క్యాన్సర్‌గా పరిగణిస్తారు. దీని ప్రకారం, బైడెన్ ప్రోస్టేట్‌లోని క్యాన్సర్ కణాలు సాధారణ కణాల కంటే చాలా భిన్నంగా ఉన్నాయని, వేగంగా పెరిగే లేదా వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
Joe Biden
Biden cancer
Joe Biden prostate cancer
Prostate cancer metastasis
Jill Biden
Gleason score
American President
Cancer diagnosis
Biden health

More Telugu News