Anuradha Paswan: లేడీ కాదు కిలేడీ... 7 నెలల్లో 25 మందిని పెళ్లాడిన మహిళ

Anuradha Paswan Arrested for Marrying 25 Men in 7 Months
  • పెళ్లి చేసుకుని వరుడిని దోచుకోవడం, పారిపోవడమే పని
  • అండర్ కవర్ ఆపరేషన్ తో భోపాల్ లో అరెస్టు చేసిన పోలీసులు
  • పెళ్లిళ్ల రాకెట్ లో సభ్యురాలని గుర్తించినట్లు వెల్లడి
వయసు పైబడుతున్నా వివాహం కాని యువకులను టార్గెట్ చేసి, పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. నగలు, నగదుతో కొత్త పెళ్లికూతురు పారిపోయిందని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సోమవారం భోపాల్‌లో సవాయ్ మాధోపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ కేవలం 7 నెలల వ్యవధిలోనే 25 మంది యువకులను ఇదేవిధంగా మోసం చేసిందని బయటపడింది. మహిళ వెనకున్న పెళ్లిళ్ల రాకెట్ ను ఛేదించిన పోలీసులు.. నిందితురాలిని అరెస్టు చేసి ఆమె గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ కు చెందిన అనురాధ పాశ్వాన్ (23) గతంలో ఓ ఆసుపత్రిలో పనిచేసింది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ.. ఆ తర్వాత మధ్యప్రదేశ్ కు మకాం మార్చింది. భోపాల్ లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ల రాకెట్ తో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న యువకులను ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. సంబంధం కుదిర్చిపెడతామని చెప్పి భారీగా కమీషన్ వసూలు చేసి అనురాధ ఫొటో చూపించేవారు. ఆపై చట్టబద్దంగా వివాహం జరిపించేవారు.

ఆ తర్వాత అనురాధ కొద్దిరోజులు అత్తారింట్లో ఉండి, వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయ్ మాధోపూర్‌కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే 3న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సునీత, పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు రూ.2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు. అయితే, ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే 2న పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఒక కానిస్టేబుల్‌ను పెళ్లికొడుకుగా నమ్మించి పంపారు. ఏజెంట్ తో సంప్రదింపులు జరపగా.. అనురాధ ఫొటో పంపించాడు. ప్రత్యక్షంగా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్.. ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రెయిడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్‌బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Anuradha Paswan
marriage scam
bride fraud
groom fraud
Rajasthan police
Indian wedding
fraudulent marriages
wedding scam india
online matrimony fraud
marriage racket

More Telugu News