Vijayanand: జూన్ 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుక .. సీఎస్ విజయానంద్ కీలక సూచనలు

Vijayanand Key Suggestions for International Yoga Day Celebrations in Visakha
  • విశాఖలో పీఎం మోదీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొంటారన్న సీఎస్ విజయానంద్
  • రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు  
  • అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో కీలక సూచనలు జారీ
జూన్ 21న విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మంది ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకూ జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో కనీసం 2 కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయి వరకు నిర్వహించే యోగా దినోత్సవ వేడుకల్లో కనీసం 2 కోట్ల మంది భాగస్వాములయ్యేలా చూడాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. దైనందిన జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు కృషి చేయాలని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం సర్క్యులర్ ఆదేశాలు, జీవోలను జారీ చేయడం జరుగుతుందని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ నోడల్ అధికారి యం.టి కృష్ణబాబు ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని “Yoga for One Earth, One Health” అనే నినాదంతో యోగాపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈనెల 21 నుండి జూన్ 21 వరకూ నెల రోజులపాటు ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని మూడు దశలుగా చేపట్టనున్నట్టు అనగా ఈనెల 21 నుండి 27 వరకూ ప్రాధమిక దశ కింద ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ, 28 నుండి జూన్ 3 వరకూ మండల స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ, జూన్ 4 నుండి 16 వరకు గ్రామ, వార్డు స్థాయిల్లో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈనెల 21న అన్ని జిల్లాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి కనీసం 10 వేల మంది ప్రజాప్రతినిధులు, యోగా శిక్షకులు, పిఇటిలు, యోగా అభ్యాసకులు తదితరులతో కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను నిర్వహించాలని సూచించారు.

ఈ నెల 27న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సమావేశమై వారి భాగస్వామ్యంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని చెప్పారు. జూన్ 21న రాష్ట్ర వ్యాప్తంగా 100 పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, పీఆర్ అండ్ ఆర్డీ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఐఅండ్ఐ శాఖ కార్యదర్శి డా.ఎన్. యువరాజ్, న్యాయ శాఖ కార్యదర్శి ప్రతిభా దేవి, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల పాల్గొన్నారు. 
Vijayanand
International Yoga Day
Visakhapatnam
PM Modi
Yoga Andhra
Yoga for One Earth One Health
Yoga Training
Andhra Pradesh
Yoga Awareness
Ramakrishna Beach

More Telugu News