Justice Abhay Oka: న్యాయమూర్తులూ మనుషులే.. పొరపాట్లు జరుగుతాయన్న జస్టిస్ అభయ్ ఓకా

Justice Abhay Oka Judges are Human Mistakes Happen
  • గృహ హింస చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టులకు మార్గదర్శనం
  • ఓ కేసులో తాను పొరపాటు చేసినట్లు అంగీకరించిన సుప్రీం జడ్జి
  • న్యాయమూర్తులకు అభ్యాసం అనేది నిరంతర ప్రక్రియ అని వ్యాఖ్య
న్యాయమూర్తులు కూడా మనుషులేనని, తీర్పులు వెలువరించే క్రమంలో వారు పొరపాట్లు చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్. ఓకా అభిప్రాయపడ్డారు. 2016లో తాను బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు గృహ హింస చట్టం (డీవీ యాక్ట్) వ్యాఖ్యానానికి సంబంధించిన ఒక కేసులో పొరపాటు చేశానని ఆయన అంగీకరించారు. న్యాయమూర్తులకు ఇది నిరంతర అభ్యాస ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.

గృహ హింస చట్టంలోని సెక్షన్ 12(1) కింద దాఖలైన దరఖాస్తుల విచారణను రద్దు చేసే అధికారం సీఆర్‌పీసీ సెక్షన్ 482 కింద హైకోర్టులకు ఉందని జస్టిస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఓ తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా జస్టిస్ ఓకా కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తిగా గతంలో తాను దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని జస్టిస్ ఓకా గుర్తు చేసుకున్నారు.

"2016 అక్టోబర్ 27న బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులో నేను కూడా భాగస్వామినే. డీవీ యాక్ట్, 2005లోని సెక్షన్ 12(1) కింద చేసిన దరఖాస్తును రద్దు చేయడానికి వీలులేదని ఆ తీర్పులో పేర్కొన్నాం. ఈ అభిప్రాయం తప్పని అదే హైకోర్టు ఫుల్ బెంచ్ ద్వారా తేలింది. న్యాయమూర్తులుగా మా తప్పులను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాపైనే ఉంది. న్యాయమూర్తులకు కూడా నిరంతర అభ్యాస ప్రక్రియ అవసరం" అని జస్టిస్ ఓకా పేర్కొన్నారు.

గృహ హింస చట్టం మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన చట్టమని జస్టిస్ ఓకా చెప్పారు. గృహ హింసకు గురైన మహిళలకు న్యాయం చేసేందుకే ఇది ఉద్దేశించబడిందని స్పష్టం చేశారు. సెక్షన్ 482 ద్వారా సంక్రమించిన అధికారంతో ఇలాంటి దరఖాస్తులను రద్దు చేసేటప్పుడు హైకోర్టులు ఆచితూచి వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. కేసులో తీవ్రమైన చట్టవిరుద్ధత లేదా న్యాయ ప్రక్రియ దుర్వినియోగం జరిగిందని స్పష్టంగా తేలినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలని పేర్కొంది. ఈ విషయంలో హైకోర్టులు సంయమనం పాటించకపోతే గృహ హింస చట్టం 2005 ఉద్దేశమే దెబ్బతింటుందని ధర్మాసనం హెచ్చరించింది.
Justice Abhay Oka
Abhay Oka
Supreme Court
domestic violence act
DV Act
Bombay High Court
section 482 crpc
section 12(1)
Ujjal Bhuyan
womens welfare

More Telugu News