Kotamreddy Sridhar Reddy: వంశీ, నాని కర్మ అనుభవిస్తున్నారు: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kotamreddy Says No Sympathy for Vamsi Nani Over Past Comments
  • భువనేశ్వరిని తిట్టడంలో జగన్ ప్రోత్సాహం ఉందన్న ఎమ్మెల్యే
  • జగన్‌ను అరెస్ట్ చేసినా సానుభూతి రాదన్న కోటంరెడ్డి
  • అమరావతి రైతులపై దాడి చేయాలని సజ్జల సూచించారన్న కోటంరెడ్డి
  • వైసీపీలో బూతులకు ప్రోత్సాహం
మాజీ మంత్రులు వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రస్తుతం వారు చేసిన వ్యాఖ్యలకు మూల్యం చెల్లించుకుంటున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లేదా ఇతర కేసుల్లో అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి సానుభూతి వస్తుందనేది అవాస్తవమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరి విషయంలో తనకు ఎలాంటి సానుభూతి లేదని, దేవుడి స్క్రిప్ట్ ప్రకారం అంతా జరుగుతోందని ఆయన అన్నారు. జగన్ ప్రోత్సాహంతోనే ఆనాడు కొందరు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలాంటి సంస్కృతి టీడీపీలో లేదని స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన ధనుంజయ రెడ్డిని లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేసిన నేపథ్యంలో, తదుపరి అరెస్ట్ జగన్‌దేనని ప్రచారం జరుగుతోందని కోటంరెడ్డి ప్రస్తావించారు. ఒకవేళ జగన్‌ను అరెస్ట్ చేసినా, లేదా పాత అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దయినా ఆయనకు సానుభూతి వస్తుందని తాను అనుకోవడం లేదని తెలిపారు. "అత్యంత నిజాయితీపరుడిగా పేరుపొందిన అరవింద్ కేజ్రీవాల్‌ను మద్యం కుంభకోణం కేసులో జైల్లో పెట్టారు. జైలు నుంచి వచ్చాక ఎన్నికలు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 2014కు ముందు జగన్ జైల్లో ఉన్నా అధికారం రాలేదు కదా?" అని కోటంరెడ్డి గుర్తుచేశారు. కాబట్టి, కేసుల్లో జగన్ పాత్ర ఉందని విచారణ అధికారులు భావిస్తే చర్యలు తీసుకుంటారని, అరెస్టుల వల్ల వైసీపీకి సానుభూతి వస్తుందనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మాజీ మంత్రులు కొడాలి నాని, వల్లభనేని వంశీల ప్రస్తుత పరిస్థితిపై కోటంరెడ్డి ఘాటుగా స్పందించారు. "రెడ్ బుక్‌లో పేరుందనగానే కొడాలి నానికి గుండె నొప్పి వచ్చింది, బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఇక, నారా భువనేశ్వరి గారిని ఉద్దేశించి వంశీ చేసిన దారుణమైన వ్యాఖ్యలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని, 20 కేజీలు బరువు తగ్గి నరకం అనుభవిస్తున్నారు. అధికారం ఉందని సభ్యసమాజంలో ఎవరూ మాట్లాడలేని మాటల్ని శాసనసభలో మాట్లాడిన వారిపై నాకే కాదు, తెలుగు ప్రజలెవరికీ సానుభూతి ఉండదు. ఇది దేవుడి స్క్రిప్ట్. ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది" అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగిందని, పరోక్షంగా టీడీపీకి మంచి చేసిందని ఆయన అన్నారు. "నాలాంటి ఆవేశం ఎక్కువ ఉన్న వాడుంటే పరిస్థితి వేరేగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి కాబట్టి, చట్టప్రకారం జరగాలని ఆలోచించారు కాబట్టి ఆలస్యమైంది" అని కోటంరెడ్డి తెలిపారు.

వంశీ, నాని మాట్లాడిన మాటలు వాళ్లవి కావని, జగన్మోహన్ రెడ్డి మాట్లాడించిన మాటలని కోటంరెడ్డి ఆరోపించారు. "జగన్ గారు అలాంటి మాటలు మాట్లాడితేనే ప్రోత్సహిస్తారు, భుజం తడతారు. ప్రత్యర్థుల మీద, మీడియా మీద హద్దు మీరి మాట్లాడితే బాగా ప్రోత్సహిస్తారు. జోగి రమేష్ శాసనసభలో ఏబీఎన్ రాధాకృష్ణ గారి గురించి, రామోజీరావు గారి గురించి ఎలా మాట్లాడారో, చంద్రబాబు గారి ఇంటిపై దాడికి ఎలా యత్నించారో అందరికీ తెలుసు. అధినేత ఖండించకపోగా మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ జగన్ గారి మాటలుగానే భావించాలి" అని శ్రీధర్ రెడ్డి అన్నారు.

వైసీపీ కార్యాలయం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా తిట్టమని స్క్రిప్ట్ పంపేవారని, తిట్టకపోతే పార్టీలో భవిష్యత్తు ఉండదని కొందరు నేతలు చెప్పినట్లు కోటంరెడ్డి వెల్లడించారు. "నువ్వు హుందాగా మాట్లాడితే కుదరదు, అడ్డగోలుగా మాట్లాడాలి, తిట్టాలి అని సజ్జల గారు నాతో అన్నారు. అమరావతి రైతులు వరదల్లో చిక్కుకుంటే మానవత్వంతో పరామర్శిస్తే, 'వాళ్లని పరామర్శించడం తప్పు, వాళ్ల మీద దాడి చేసి ఉంటే జగన్ గారు మెచ్చుకునేవారు' అని సజ్జల గారు స్వయంగా నాతో చెప్పారు" అని కోటంరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి ప్రజలు పాదయాత్రగా వెళ్తుంటే సర్వేపల్లి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో దాడులు జరిగాయని, ఫ్లెక్సీలు చించేశారని గుర్తుచేశారు.

ప్రస్తుతం తాను టీడీపీ శాసనసభ్యుడినని, కష్టకాలంలో చంద్రబాబు, లోకేశ్ తనకు అండగా నిలిచి, టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని కోటంరెడ్డి తెలిపారు. "ఈరోజు కూడా జగన్ గారి గురించి, వైసీపీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మాట్లాడతాను. హుందా అయిన భాషతో, పద్ధతైన భాషతో, ప్రజల్ని ఒప్పించే, మెప్పించే భాషతో మాట్లాడతాను. బూతులు తిట్టడం నా వల్ల కాదు. టీడీపీలో అలా మాట్లాడమని చెప్పరు, మాట్లాడితే ఊరుకోరు. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే టీడీపీ స్టేట్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది" అని కోటంరెడ్డి స్పష్టం చేశారు.
Kotamreddy Sridhar Reddy
Vallabhaneni Vamsi
Kodali Nani
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
TDP
YSRCP
Andhra Pradesh Politics
Liquor Scam
Sajjala Ramakrishna Reddy

More Telugu News