KA Paul: పోలీసులు విఫలమైతే నేనే రంగంలోకి దిగుతా: కేఏ పాల్

KA Paul on Andhra Pradesh Police Failure and James Case
  • తిరుపతిలో జేమ్స్ అనే బీటెక్ విద్యార్థి కిడ్నాప్, చిత్రహింసలకు గురయ్యాడని ఆరోపణ
  • రాష్ట్రంలో అన్యాయం, అక్రమ రవాణా, హింస రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన
  • పోలీసులు చర్యలు తీసుకోకుంటే తానే రంగంలోకి దిగుతానని స్పష్టం
  • మే 24న గ్లోబల్ పీస్ అసెంబ్లీకి హాజరుకావాలని ప్రజలకు పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను తక్షణమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును హెచ్చరిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు.

తిరుపతిలో జేమ్స్ అనే బీటెక్ విద్యార్థిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి, చనిపోయాడనుకుని వదిలేశారని కేఏ పాల్ తన ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రంలో అన్యాయం, అక్రమ రవాణా, హింసాత్మక ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. "చంద్రబాబు గారూ... ధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది? మీ 50 సంవత్సరాల అనుభవం ఏమైంది?" అని ప్రశ్నించారు.

పోలీసులు తమ విధులను సరిగా నిర్వర్తించడంలో విఫలమైతే, తానే స్వయంగా రంగంలోకి దిగుతానని కేఏ పాల్ స్పష్టం చేశారు. "పాస్టర్ ప్రవీణ్ ది హత్య అని చెబితే, యాక్సిడెంట్ అని పనికిమాలిన పోలీసులు సృష్టించారని కోట్లమంది కోడై కూశారు. మీరు అందులో  ఫెయిలైపోయారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో దళితుడ్ని బహిష్కరిస్తే  మీరు అందులో చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జేమ్స్ వ్యవహారం! అంటే రోజుకొక అన్యాయం, అత్యాచారం జరుగుతున్నాయి"  అంటూ కేఏ పాల్ ధ్వజమెత్తారు.

ప్రజలందరూ మే 24న సికింద్రాబాద్ లో జరగనున్న గ్లోబల్ పీస్ అసెంబ్లీలో పాల్గొనాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. "జేమ్స్‌కు న్యాయం జరగాలి" (JusticeForJames) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తక్షణమే దృష్టి సారించి, ప్రజలకు భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
KA Paul
Andhra Pradesh
Chandrababu Naidu
James
kidnap case
Pawan Kalyan
Praja Shanti Party
law and order
Global Peace Assembly
JusticeForJames

More Telugu News